శనివారం 28 మార్చి 2020
Sports - Mar 01, 2020 , 17:02:12

ఆట మారలేదు..భారత్‌ 90/6

ఆట మారలేదు..భారత్‌ 90/6

రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ఆఖరుకు భారత్‌ 6 వికెట్లకు 90 పరుగులే చేసింది.

క్రైస్ట్‌చర్చ్‌:  బౌన్స్‌, స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ మళ్లీ భంగపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ఆఖరుకు భారత్‌ 6 వికెట్లకు 90 పరుగులే చేసింది. దీంతో టీమ్‌ఇండియా 97 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కివీస్‌ స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(3/ 12) భారత్‌ను భారీ  దెబ్బకొట్టాడు. ఐదుగురు పేసర్లతో బరిలో దిగిన ఆతిథ్య జట్టు మంచి బౌలింగ్‌తో కోహ్లీసేనను కట్టడి చేసింది.  తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 235 పరుగులకే ఆలౌటైనప్పటికీ ఆదివారం ఆటముగిసేసరికి భారత్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. అంతకుముందు భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ(4/81) ధాటికి కివీస్‌ 235 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.  టామ్‌ లాథమ్‌(52) అర్ధశతకంతో రాణించగా ఆఖర్లో జేమీసన్‌(49) చేలరేగడంతో కివీస్‌ ఆమాత్రం స్కోరు చేసింది. 

రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఈసారీ శుభారంభం దక్కలేదు. జట్టుస్కోరు 8 వద్ద ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(3) ఔటై మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో రాణించిన పృథ్వీ షా(14) కూడా త్వరగానే వెనుదిరిగాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు. ఫామ్‌లో లేని విరాట్‌ కోహ్లీ(14)ని గ్రాండ్‌హోం వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  కివీస్‌ పర్యటనలో పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన విరాట్‌ 11 ఇన్నింగ్స్‌లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. 

ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరున్న విరాట్‌ రెండు టెస్టుల్లో కలిపి కేవలం 38 పరుగులు మాత్రమే చేయడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది.  కుదురుకునేందుకు యత్నిస్తున్న  రహానె(9) బంతిని వికెట్ల మీదకు ఆడుకొని పెవిలియన్‌ చేరాడు.  మిగతా బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు.   ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే వెనుదిరిగారు. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ ఒక్క పరుగుకే బౌల్ట్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆఖరి సెషన్‌లోనే బౌల్ట్‌ అనూహ్యంగా మెరుపు బంతులతో విజృంభించడంతో ఆట ఆతిథ్య జట్టు చేతుల్లోకి వచ్చేసింది.  
logo