శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Feb 14, 2020 , 00:09:26

సన్నాహక పోరు

 సన్నాహక పోరు

వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురయ్యాక సంప్రదాయ ఫార్మాట్‌లో సత్తాచాటాలని టీమ్‌ఇండియా కసిమీద ఉన్నది. వన్డేల్లో కాంబినేషన్లు సఫలం కాకపోవడంతో టెస్టు సిరీస్‌లోతుదిజట్టు కూర్పు విషయంలో మరింత జాగ్రత్త వహించాలని మేనేజ్‌మెంట్‌ యోచిస్తున్నది. ఓపెనింగ్‌ జోడీ సహా.. స్పిన్నర్‌గా అశ్విన్‌, జడేజాల్లో ఎవరిని ఆడించాలనే విషయంలోనూ సందిగ్ధం ఉంది. ఈ తరుణంలో అసలు టెస్టుపోరాటానికి ముందు న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో నేటి నుంచి టీమ్‌ఇండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌ ఆడనుంది. ఈ వామప్‌ పోటీలో ప్రదర్శనను బట్టి తుది జట్టుపై స్పష్టత తెచ్చుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తున్నది.

  • నేటి నుంచి భారత్‌ - న్యూజిలాండ్‌ ఎలెవెన్‌ వామప్‌ మ్యాచ్‌
  • సత్తాచాటాలని టీమ్‌ఇండియా యువ ఆటగాళ్ల తహతహ

వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురయ్యాక సంప్రదాయ ఫార్మాట్‌లో సత్తాచాటాలని టీమ్‌ఇండియా కసిమీద ఉన్నది. వన్డేల్లో కాంబినేషన్లు సఫలం కాకపోవడంతో టెస్టు సిరీస్‌లోతుదిజట్టు కూర్పు విషయంలో మరింత జాగ్రత్త వహించాలని మేనేజ్‌మెంట్‌ యోచిస్తున్నది. ఓపెనింగ్‌ జోడీ సహా.. స్పిన్నర్‌గా అశ్విన్‌, జడేజాల్లో ఎవరిని ఆడించాలనే విషయంలోనూ సందిగ్ధం ఉంది. ఈ తరుణంలో అసలు టెస్టుపోరాటానికి ముందు న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో నేటి నుంచి టీమ్‌ఇండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌ ఆడనుంది. ఈ వామప్‌ పోటీలో ప్రదర్శనను బట్టి తుది జట్టుపై స్పష్టత తెచ్చుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తున్నది. హామిల్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై పరిమిత ఓవర్ల పోరు తర్వాత సంప్రదాయ టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా కసరత్తులు చేస్తున్నది. కివీస్‌పై టీ20ల్లో ఘనమైన ఫలితం వచ్చినా.. వన్డేల్లో క్లీన్‌స్వీప్‌ ఎదురవడంతో మరింత జాగ్రత్తగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఇక్కడి సెడాన్‌ పార్క్‌ మైదానంలో జరిగే మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో టీమ్‌ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకొని టెస్టు సిరీస్‌లో పక్కా ప్రణాళికతో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. వామప్‌ గేమ్‌లో సత్తాచాటి టెస్టు సిరీస్‌ తుదిజట్టులో చోటు దక్కించుకోవాలని భారత యువ ఆటగాళ్లు సైతం పట్టుదలగా ఉన్నారు. ప్లేయర్ల ప్రదర్శనను బట్టే టెస్టు సిరీస్‌ తుదిజట్టు గురించి ఆలోచించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ సైతం భావిస్తున్నది. న్యూజిలాండ్‌ ఎలెవెన్‌ జట్టు  సోధీ, నీషమ్‌, స్టిఫర్ట్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లతో కళకళలాడుతుండడంతో ఈ వామప్‌ మ్యాచ్‌ భారత ఆటగాళ్లకు మంచి సన్నాహకంగా ఉండనుంది. టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ఈనెల 21న ప్రారంభం కానుంది. 


గిల్‌ - షాకు కీలకం

గాయం కారణంగా భారత జట్టుకు స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ దూరమైనా.. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్‌ స్థానానికి పోటీ తగ్గలేదు. సంప్రదాయ క్రికెట్‌లో అదరగొడుతున్న మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం దాదాపు ఖాయం కాగా.. మరో స్థానం కోసం పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ మధ్య పోటీ ఉంది. షా, గిల్‌ ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. భారత్‌-ఏ తరఫున కివీస్‌-ఏపై అనధికార టెస్టుల్లో ఇటీవలే గిల్‌  ద్విశతకం సహా ఓ సెంచరీతో చెలరేగాడు. దీంతో టెస్టుల్లో అరంగేట్రం చాన్స్‌ వస్తుందని అతడు ఆశిస్తున్నాడు. మరోవైపు పృథ్వీ షా వన్డే సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయినా.. దేశవాళీ ప్రదర్శనతో చోటు ఖాయమనే అనుకుంటున్నాడు. అయితే ఈ వామప్‌ మ్యాచ్‌లో కనబరిచే ప్రదర్శనను బట్టే అసలు సిరీస్‌కు ఓపెనింగ్‌ జోడీ ఖాయమయ్యే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో ఓపెనింగ్‌ కోసం పోటీలో ఉన్న ముగ్గురు యువ బ్యాట్స్‌మన్‌ సన్నాహక మ్యాచ్‌లో సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నారు. 


తిప్పేదెవరో..

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా తుదిజట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు దక్కడం కష్టమే. దీంతో  స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా మధ్య పోటీ తప్పేలా లేదు. సెడాన్‌ పార్క్‌ పిచ్‌ ఫ్లాట్‌గా ఉండడంతో  వామప్‌ మ్యాచ్‌లో తన విభిన్న స్పిన్‌ మాయాజాలాన్ని చూపాలని అశ్విన్‌ భావిస్తున్నాడు. జడేజా సైతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో రాణిస్తున్నా... టెస్టు సిరీస్‌లో మాత్రం అశ్విన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మరింత కట్టుదిట్టంగా బంతులేసి తుదిజట్టు పోటీలోకి రావాలని జడ్డూ పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు వన్డే సిరీస్‌లో వికెట్‌ తీయలేకపోయిన స్టార్‌ పేసర్‌ బుమ్రా సైతం సన్నాహక మ్యాచ్‌తో గాడిలో పడాలని అనుకుంటున్నాడు. విదేశీ సిరీస్‌ల్లో భారత్‌కు కీలక బౌలర్‌గా ఉన్న ఇషాంత్‌ ఈ సిరీస్‌కు దూరమవడంతో ఆ స్థానంలో వచ్చిన సైనీ తన మార్క్‌ చూపించాలని తహతహలాడుతున్నాడు. 


పృథ్వీతో పోటీ లేదు.. గిల్‌ 

కివీస్‌తో తొలి టెస్టులో చోటు దక్కితే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథా చేసుకోనని భారత యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. అయితే, తుదిజట్టులో చోటు కోసం పృథ్వీ షాతో తాను పోటీ పడడం లేదన్నాడు. ‘మా స్థానాల్లో ఇద్దరం బాగా ఆడుతున్నాం. తుది జట్టు ఎంపిక అనేది జట్టు మేనేజ్‌మెంట్‌ చేతిలో ఉంటుంది. ఎవరు ఆడాలో వారే నిర్ణయిస్తారు. నాకు ఓపెనింగ్‌ చేయడం కొత్తేం కాదు’ అని గిల్‌ చెప్పాడు. జట్లు 

భారత్‌ : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), హనుమ విహారి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌, రిషభ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, శుభ్‌మన్‌ గిల్‌ 

న్యూజిలాండ్‌ ఎలెవెన్‌ : డేరిల్‌ మిచెల్‌(కెప్టెన్‌), టామ్‌ బ్రూస్‌, డేన్‌ క్లెవర్‌, హెన్రీ కూపర్‌, స్కాట్‌ కుగ్లీన్‌, జేమ్స్‌ నీషమ్‌, రచిన్‌ రవీంద్ర, టిమ్‌ స్టిఫర్ట్‌, ఇష్‌ సోధీ, టిక్నర్‌, విల్‌ యంగ్‌, 13వ ఆటగాడు జేక్‌ గిబ్సన్‌(శుక్రవారం), స్కాట్‌ జాన్‌స్టన్‌(శని, ఆదివారాలు)


బుమ్రా దూకుడు పెంచాలి  

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కాస్త రిస్క్‌ తీసుకొని.. మరింత దూకుడుగా బౌలింగ్‌ చేయాలని మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. బుమ్రా.. వికెట్‌ టేకర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నాడని, దాన్ని నిలుపుకునేందుకు పోరాడాలని అన్నాడు. ‘తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ డిఫెన్స్‌ ఆడేందుకే ప్రాధాన్యమిస్తారని బుమ్రాకు తెలుసు. అందుకే బ్యాట్స్‌మెన్‌ తప్పిదం చేయాలని ఆశించకుండా వికెట్‌ తీసేందుకు అతడు కొత్త మార్గాలు వెతకాలి. కొన్ని పరుగులు ఇచ్చినా పర్వాలేదనుకొని... ఆడితీరాల్సిన బంతులను బ్యాట్స్‌మెన్‌కు వేయాలి. వికెటే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి’ అని జాక్‌ చెప్పాడు.

logo