శుక్రవారం 15 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 06:52:17

దూకుడుగా ఆడుతున్న పంత్‌.. భార‌త్ 197/3

దూకుడుగా ఆడుతున్న పంత్‌.. భార‌త్ 197/3

సిడ్నీ:  మూడో టెస్ట్ మ్యాచ్ పూర్తి ర‌స‌కందాయంగా మారింది. సొంత గ‌డ్డ‌పై ఆస్ట్రేలియా విజృంభిస్తుంటే మ‌నోళ్ళు కూడా వాళ్లకు ధీటుగా రాణిస్తున్నారు. త‌మ‌కు అచ్చొచ్చిన పిచ్‌పై ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 338 ప‌రుగులు చేయ‌గా, భార‌త్ 244 ప‌రుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 6 వికెట్ల న‌ష్టానికి 312 పరుగులు చేసి భార‌త్ ముందు 407 ప‌రుగులు ల‌క్ష్యాన్ని ఉంచింది. కొండంత ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ జట్టుకు గట్టి పునాదే వేశారు. నాలుగో రోజు ఆట ఆఖర్లో రోహిత్‌ ఔట్‌ కావడం టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బగా మారింది.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 98/2  ‌తో సోమ‌వారం ఇన్నింగ్స్ కొన‌సాగించిన భార‌త్‌కు ఆదిలోనే గ‌ట్టి దెబ్బ త‌గిలింది. భార‌త తాత్కాలిక కెప్టెన్ అజింక్యా ర‌హానే (4) ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. దీంతో రిష‌బ్ పంత్ క్రీజులోకి రాగా, త‌న‌దైన శైలిలో రెచ్చిపోయాడు. పుజారాతో క‌లిసి స్కోర్ బోర్డ్‌ని ఉర‌క‌లెత్తించాడు. ఈ క్ర‌మంలో పంత్‌( 73) అర్ధ సెంచ‌రీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఒక‌వైపు పుజారా(33) నిదానంగా ఆడుతుంటే మ‌రోవైపు బౌల‌ర్ల‌కి చుక్క‌లు చూపిస్తున్నాడు. ముఖ్యంగా లియాన్‌ని టార్గెట్ చేస్తూ వీరవిహారం చేస్తున్నాడు. 210 ప‌రుగుల ల‌క్ష్యం భార‌త్ ముందు ఉండ‌గా ఇది చేదిస్తుందా, లేదంటే మ్యాచ్‌ని ఆస్ట్రేలియాకు స‌మ‌ర్పిస్తుందా అనేది చూడాలి.