బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 15:33:23

IND vs AUS: భారత్‌ లక్ష్యం 185

IND vs AUS: భారత్‌ లక్ష్యం 185

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 తుది పోరులో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు అలీసా హీలీ(75: 39 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), బెత్‌ మూనీ(78 నాటౌట్‌: 54 బంతుల్లో 10ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.  ఆసీస్ భారీ స్కోర్‌లో కీలక పాత్ర పోషించింది వీరిద్దరే. ఈ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించింది.  భారత పేస్‌ విభాగం బలహీనంగా ఉండటంతో ఆసీస్‌ ఓపెనర్లు రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. 20 ఓవర్లు ఆడిన ఆసీస్‌ 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. బౌలర్లు తేలిపోయిన తుదిపోరులో ఇక భారత బ్యాటర్లపైనే భారమంతా..!

సొంతగడ్డపై భారీ ప్రేక్షకుల మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌   మ్యాచ్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ బ్యాటర్లు పవర్‌ప్లేలో  49 రన్స్‌ రాబట్టి  జట్టుకు శుభారంభం అందించారు.  మెల్‌బోర్న్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుండటంతో   అలీసా హీలీ అలవోకగా బౌండరీలు  బాదింది. భారత బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ జట్టుకు భారీ స్కోరు అందించారు. మ్యాచ్‌లో హీలీ బ్యాటింగే హైలెట్‌.అలవోకగా సిక్సర్లు బాదుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. 

భారత బౌలర్లను సమర్థంగా  ఎదుర్కొన్న హీలీ  కేవలం 30 బంతుల్లోనే అర్దశతకం పూర్తి చేసుకుంది.గైక్వాడ్‌ వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టిన హీలీ..శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో ఏకంగా వరుసగా 3 సిక్సర్లు బాది ఆకట్టుకుంది.  ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో హీలీ 2వేల పరుగుల మైలురాయిని అందుకుంది. ఇక ఆఖరి వరకు క్రీజులో ఉన్న బెత్‌ మూనీ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. మొదట్లో నిదానంగా ఆడిన ఆమె ఆఖర్లో విజృంభించి ఆజేయంగా నిలిచింది. భారత బౌలర్లు హీలీ విధ్వంసం ముందు తేలిపోయారు. లయ తప్పి బంతులేయడంతో ఓపెనర్లు సునాయాసంగా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. logo
>>>>>>