పింక్ బాల్ టెస్ట్.. తొలిరోజు టీమిండియా 233/6

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి డేనైట్ టెస్ట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, పుజారా, రహానే కాసేపు పోరాడినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 6 వికెట్లకు 233 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, కమిన్స్, హేజిల్‌వుడ్, నేథన్ లయన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ కోహ్లి రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా వచ్చిన పృథ్వి షా (0), మయాంక్ అగర్వాల్ (17) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ రెండో బంతికే పృథ్వి షా డకౌటయ్యాడు.
32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ భారీ భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించిన తర్వాత లయన్ బౌలింగ్‌లో పుజారా (43) ఔటయ్యాడు. ఆ తర్వాత కోహ్లితో కలిసిన రహానే మరో మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లి.. సెంచరీ వైపు దూసుకెళ్తుండగా 74 పరుగుల దగ్గర రనౌటయ్యాడు. దీంతో 88 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే రహానే (42), హనుమ విహారీ(16) కూడా పెవిలియన్‌కు చేరారు. ఆట ముగిసే సమయానికి సాహా (9), అశ్విన్ (15) క్రీజులో ఉన్నారు.