ఆదివారం 24 జనవరి 2021
Sports - Nov 28, 2020 , 03:48:04

తొలి అడుగేతడబడె

తొలి అడుగేతడబడె

  • ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమి
  • హార్దిక్‌, ధవన్‌ పోరాటం వృథా  
  • శతకాలతో స్మిత్‌, ఫించ్‌ విజృంభణ

భారీ అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 268 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తమ తొలి మ్యాచ్‌లోనే నిరాశ పరిచింది. మహమ్మారి రాక తర్వాత తొలిసారి అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉసూరుమనిపించింది. ఫించ్‌, స్మిత్‌ సూపర్‌ సెంచరీలకు తోడు మ్యాక్స్‌వెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు అందుకున్న కంగారూలు..బౌలింగ్‌లోనూ కట్టడి చేశారు. లక్ష్యఛేదనలో సహచరులు విఫలమైన చోట హార్దిక్‌, ధవన్‌ పోరాడినా ఫలితం లేకపోయింది. మొత్తంగా పసలేని బౌలింగ్‌, పేలవ ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌లో వైఫల్యంతో కోహ్లీసేన ఓటమితో పర్యటన ప్రారంభించింది. 

సిడ్నీ: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను టీమ్‌ఇండియా నిరాశాజనకంగా ఆరంభించింది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ వీరబాదుడు ముందు తేలిపోయి చాలాకాలం తర్వాత బరిలోకి దిగిన మొదటి అంతర్జాతీయ వన్డేలో ఓటమి చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ ప్రేక్షకుల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్‌పై అలవోక విజయం సాధించింది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌(66 బంతుల్లో 105; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(124 బంతుల్లో 114; 9ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో కదం తొక్కడంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(19 బంతుల్లో 45; 5ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా సత్తాచాటాడు. భారత బౌలర్లలో షమీ మూడు, జస్పీత్‌ బుమ్రా, నవ్‌దీప్‌ సైనీ, యజ్వేంద్ర చాహల్‌ చెరో వికెట్‌ తీశారు. షమీ మినహా మిగిలిన వారంతా ధారాళంగా పరుగులిచ్చేశారు. భారీ లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 8 వికెట్లకు 308 పరుగులకే పరిమితమైంది. హార్దిక్‌ పాండ్యా(76 బంతుల్లో 90; 7ఫోర్లు, 4సిక్స్‌లు), శిఖర్‌ ధవన్‌(86 బంతుల్లో 74; 10ఫోర్లు) పోరాడిన మిగిలిన వారు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లు స్పిన్నర్‌ జంపా(4/54), హేజిల్‌వుడ్‌(3/55) భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బతీశారు. స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది.    

హార్దిక్‌, ధవన్‌ నిలిచినా.. 


భారీ లక్ష్యఛేదనలో భారత్‌కు గొప్ప ఆరంభం లభించలేదు. తొలుత దూకుడుగా ఆడిన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(22), ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ(21), శ్రేయస్‌ అయ్యర్‌(2)ను ఆసీస్‌ పేసర్‌ హేజిల్‌వుడ్‌ అద్భుత బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 10 ఓవర్లలో భారత్‌ 80 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ ధవన్‌తో హార్దిక్‌ పాండ్య జత కలిశాడు. ఈ ఇద్దరూ సాధికారికంగా ముందుకు సాగుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగారు. ముఖ్యంగా టాప్‌గేర్‌లో ఆడిన పాండ్య మెరుపు వేగంతో ఓపెనర్‌ ధవన్‌ స్కోరును దాటేశాడు. 31 బంతుల్లోనే హార్దిక్‌ అర్ధశతకాన్ని పూర్తి చేసుకోగా, ధవన్‌ 55 బంతుల్లో ఆ మార్క్‌ చేరాడు. అయితే గెలుపు ఆశలు చిగురించిన సమయంలో 35వ ఓవర్లో జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి ధవన్‌ ఔటయ్యాడు. దీంతో  ఐదో వికెట్‌కు 128 పరుగుల  భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపు పోరాడిన హార్దిక్‌.. జంపా బౌలింగ్‌లోనే ఔటై వన్డేల్లో తొలి శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. చివరి పది ఓవర్లకు 125 పరుగులు అవసరం కాగా చివర్లో జడేజా(25), సైనీ(29నాటౌట్‌), షమీ(13) చెరో కొన్ని పరుగులు చేసి ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించ     గలిగారు. 

శతక్కొట్టిన ఫించ్‌, స్మిత్‌ 


ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌(69) అదిరే ఆటతో భారీ స్కోరుకు బాటలు వేశారు. ఐపీఎల్‌లో ఫామ్‌ను కొనసాగిస్తూ వార్నర్‌ అర్ధశతకంతో అదరగొట్టాడు. 28వ ఓవర్లో తొలివికెట్‌గా వార్నర్‌ను షమీ వెనక్కి పంపడంతో 156 పరుగుల వద్ద ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఫించ్‌ నెమ్మదిగానే ఆడినా స్టీవ్‌ స్మిత్‌ చెలరేగిపోయాడు. బౌండరీలతో మోతెక్కించాడు. శతకం తర్వాత ఫించ్‌ వెనుదిరిగినా.. స్మిత్‌ జోరు మా త్రం తగ్గలేదు. స్టొయినిస్‌ను చాహల్‌ డకౌట్‌ చేయగా.. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రివర్స్‌ స్వీప్‌లతో అలరించాడు. 62 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న స్మిత్‌ చివరి ఓవర్లో ఔటయ్యాడు.

జాదవ్‌ను దాటిన హార్దిక్‌ 

వన్డేల్లో వేగంగా 1000 పరుగుల మార్కును చేరిన భారత బ్యాట్స్‌మన్‌గా హార్దిక్‌ పాండ్య(857 బంతులు) చరి త్ర సృష్టించాడు. ఇంతకు ముందు కేదార్‌ జాదవ్‌ (937 బంతులు) పేరిట ఈ రికార్డు ఉండేది. 

స్కోరు బోర్డు 

ఆస్ట్రేలియా: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 69, ఫించ్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 114, స్మిత్‌ (బౌల్డ్‌) షమీ 105, స్టొయినిస్‌ (సి) రాహుల్‌ (బి) చాహల్‌ 0, మ్యాక్స్‌వెల్‌ (సి) జడేజ (బి) షమీ 45, లబుషేన్‌ (సి) ధవన్‌ (బి) సైనీ 2, క్యారీ (నాటౌట్‌) 17, కమిన్స్‌ (నాటౌట్‌)1, ఎక్స్‌ట్రాలు : 21. మొత్తం : 50 ఓవర్లలో 6 వికెట్లకు 374. వికెట్ల పతనం: 1-156, 2-264, 3-271, 4-328, 5-331, 6-372. బౌలింగ్‌: షమీ: 10-0-59-3, బుమ్రా 10-0-73-1, సైనీ 10-0-83-1, చాహల్‌ 10-0-89-1, జడేజ 10-0-63-0.

 భారత్‌: మయాంక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హేజిల్‌వుడ్‌ 22, ధవన్‌ (సి) స్టార్క్‌ (బి) జంపా 74, కోహ్లీ (సి) ఫించ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 21, శ్రేయస్‌ (సి) క్యారీ (సి) హేజిల్‌వుడ్‌ 2, రాహుల్‌ (సి) స్మిత్‌ (బి) జంపా 12, హార్దిక్‌ (సి) స్టార్క్‌ (బి) జంపా 90, జడేజ (సి) స్టార్క్‌ (బి) జంపా 25, షమీ (బౌల్డ్‌) స్టార్క్‌ 13,  సైనీ (నాటౌట్‌) 29, బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 20. మొత్తం: 50 ఓవర్లలో 8 వికెట్లకు 308. వికెట్ల పతనం: 1-53, 2-78, 3-80, 4-101, 5-229, 6-247, 7-281, 8-308. బౌలింగ్‌: స్టార్క్‌ 9-0-65-1, హేజిల్‌వుడ్‌ 10-0-55-3, కమిన్స్‌ 8-0-52-0, జంపా 10-0-54-4, స్టొయినిస్‌ 6.2-0-25-0, మ్యాక్స్‌వెల్‌ 6.4-0-55-0. 

అదానీకి రుణం ఇవ్వొద్దు..


మ్యాచ్‌లో ఓ అసాధారణ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ పూర్తయిన సమయంలో మైదానంలోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దూసుకొచ్చారు. బొగ్గు గనుల తవ్వకం కోసం అదానీ సంస్థకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వకూడదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.  ఆ తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు. కొవిడ్‌-19 నేపథ్యంలో బయో బబుల్‌లో నిర్వహిస్తున్న ఈ సిరీస్‌లో భద్రతా లోపం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

1

వన్డేల్లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు సమర్పించిన స్పిన్నర్‌గా చాహల్‌ (1/89) చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 

1

వన్డే చరిత్రలో భారత్‌పై ఆస్ట్రేలియా(374/6)కు ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో చేసిన 359 పరుగులే అత్యధికం. 17ఏండ్ల తర్వాత ఆసీస్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. 

3

వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున మూడో అత్యధిక వేగవంతమైన శతకాన్ని(62 బంతుల్లో) స్టీవ్‌ స్మిత్‌ ఈ మ్యాచ్‌లో నమోదు చేశాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(51 బంతుల్లో) పేరిట ఫాస్టెస్‌ సెంచరీ రికార్డు ఉంది. 

17

భారత్‌ వరుసగా ఆరో అంతర్జాతీయ మ్యాచ్‌ ఓటమిని మూటగట్టుకుంది. 17 ఏండ్లలో (2002-03) టీమ్‌ఇండియా ఇలా వరుసగా ఓడడం ఇదే తొలిసారి. 


logo