బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 16:23:27

రసవత్తర పోరులో భారత్‌ ఓటమి..

రసవత్తర పోరులో భారత్‌ ఓటమి..

ఆక్లాండ్‌: ఈడెన్‌పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ రసవత్తర పోరులో భారత్‌ ఓటమి పాలవగా.. ఆతిథ్య కివీస్‌ 22 పరుగులతో ఘనవిజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-0తో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే పడుతూ లేస్తూ ఇన్నింగ్స్‌ను లాగింది. ఓపెనర్లు పృథ్వీ షా(24), మయాంక్‌ అగర్వాల్‌(3) మరోసారి విఫలమయ్యారు. ఛేదనలో మొనగాడైన కోహ్లి(15) సైతం తక్కువ స్కోరుకే.. సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయి, నిరాశగా పెవిలియన్‌ చేరాడు. మరో 4 ఓవర్ల వ్యవధిలో మంచి ఫామ్‌లో ఉన్న లోకేష్‌ రాహుల్‌ సైతం ఔటయ్యాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(57 బంతుల్లో 52: 7 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టు విజయం వైపు దూసుకెళ్తుందనగా.. కేదార్‌ జాదవ్‌(9), శ్రేయాస్‌ వెంటవెంటనే ఔటయ్యారు. 

తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(55), షార్దూల్‌ ఠాకూర్‌(15 బంతుల్లో 18: 3 ఫోర్లు) మ్యాచ్‌పై పట్టుబిగించారు. ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ కాసేపు అలరించారు. గ్రాండ్‌హోమ్‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన షార్దూల్‌ బౌల్డయ్యాడు. అప్పటికే ఇండియా భారీ పరుగుల తేడాతో ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ, ఎలాంటి అంచనాలు లేకుండా మైదానంలో అడుగుపెట్టిన యువ ఆటగాడు నవదీప్‌ సైనీ(49 బంతుల్లో 45: 5 ఫోర్లు, 2 సిక్సర్లు) భారత్‌ గెలుపుపై ఆశలు రేపాడు. జడేజా, సైనీ ఏడో వికెట్‌కు అర్ధసెంచరీ(76) భాగస్వామ్యం నమోదు చేశారు. భారీ షాట్‌ ఆడబోయి జమీసన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. సైనీ ఔటయ్యాక చేసే రన్స్‌కీ, బంతులకీ అంతరం పెరగడంతో.. ఒత్తిడిలో ఉన్న రవీంద్ర జడేజా.. నీషమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి గ్రాండ్‌హోమ్‌కు చిక్కాడు. దీంతో భారత్‌ మరో 9 బంతులు మిగిలుండగానే 251 పరుగులకు ఆలౌట్‌ అయింది.. న్యూజిలాండ్‌ బౌలర్లలో హమిష్‌ బెన్నెట్‌, టిమ్‌ సౌథీ, జమిసాన్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. నీషమ్‌ 1 వికెట్‌ తీశాడు. 

ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌(79), రాస్‌ టేలర్‌ (73), హెన్రీ నికోల్స్‌(41) రాణించారు. తొలుత కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ జోరు చూస్తే అలవోకగా 300 పరుగులు సాధిస్తుందనిపించింది. కానీ, కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. భారత బౌలర్లలో చాహల్‌ 3 వికెట్లు పడగొట్టగా, షార్దూల్‌ ఠాకూర్‌ 2, జడేజా 1 వికెట్‌ పడగొట్టారు. కివీస్‌ను అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసినప్పటికీ.. లక్ష్య ఛేదనలో భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌(అయ్యర్‌ మినహా) ఎవరూ రాణించకపోయే సరికి ఓటమిపాలైంది. కాగా, తొలి మ్యాచ్‌ ఆడి, అదరగొట్టిన కైల్‌ జమీసన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న రెండో కివీస్‌ ఆటగాడు జమీసన్‌. చివరిదైన మూడో మ్యాచ్‌ బే ఓవల్‌ స్టేడియంలో 11న జరుగనుంది.


logo
>>>>>>