గురువారం 09 జూలై 2020
Sports - May 01, 2020 , 13:10:19

టెస్టుల్లో భారత్‌ చేజారిన నంబర్‌వన్‌ ర్యాంక్

టెస్టుల్లో భారత్‌ చేజారిన నంబర్‌వన్‌ ర్యాంక్

దుబాయ్‌: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ  టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది.  నాలుగేళ్ళలో తొలిసారిగా కోహ్లీసేన నంబర్‌వన్‌ ర్యాంకును చేజార్చుకుంది. అక్టోబర్ 2016 నుంచి టీమిండియా  అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. పురుషుల  క్రికెట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 

2019 మే నుంచి ఆడిన అన్ని మ్యాచ్‌లను 100 శాతంగా, అంతకుముందు రెండేళ్ల మ్యాచ్‌లను 50 శాతంగా పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయించారు.  మెరుగైన పాయింట్లను సాధించడం ద్వారా  ఐసీసీ పురుషుల టెస్ట్ టీం ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(26 మ్యాచ్‌లు) 116 పాయింట్లతో  నంబర్‌వన్‌ ర్యాంకుకు ఎగబాకింది.  115 పాయింట్లతో  న్యూజిలాండ్(21 మ్యాచ్‌లు) రెండో స్థానం సాధించగా  భారత్(27 మ్యాచ్‌లు) ఇప్పుడు 114 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. టాప్‌-3 జట్లు కేవలం ఒక్కో పాయింట్‌ తేడాతో తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

నాలుగేండ్ల తర్వాత తొలిసారి టీమ్‌ఇండియా ఫస్ట్‌ర్యాంక్‌ను కోల్పోవడం గమనార్హం. 2016-17 సీజన్‌లో 12 టెస్టులు గెలిచిన భారత్‌ కేవలం ఒక్క టెస్టులోనే ఓటమిపాలైంది.  అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో సహా మొత్తం ఐదు సిరీస్‌లను గెలుచుకుంది.  ఐతే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధిక టెస్టు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 

టీ20ల్లోనూ కంగారులదే హవా..

పొట్టిక్రికెట్‌లోనూ ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. టీ20 ర్యాంకింగ్స్‌లోనూ కంగారూలదే అగ్రస్థానం. రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఇంగ్లాండ్‌, భారత్‌ నిలిచాయి. పాకిస్థాన్‌ నాలుగు, సౌతాఫ్రికా ఐదో ర్యాంకు సాధించాయి. logo