సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 17:35:13

భారత్‌ ఓటమి.. ‘శ్రేయాస్‌’ సెంచరీ వృథా

భారత్‌ ఓటమి.. ‘శ్రేయాస్‌’ సెంచరీ వృథా

హామిల్టన్‌: సెడాన్‌ పార్క్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలయ్యింది. 348 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్‌.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ అద్భుత సెంచరీ(84 బంతుల్లో 109: 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌ హెన్రీ నికోల్స్‌(78), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌, వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ (69) అర్ధసెంచరీలతో రాణించారు. కివీస్‌.. ఆదినుంచే లక్ష్యం దిశగా సాగింది. ఓపెనర్లు.. గప్టిల్‌(32), నికోల్స్‌ తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించి, ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. అనంతరం రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌ నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం(138 పరుగులు) నమోదు చేసి, జట్టు విజయాన్ని ఖరారు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ తీశారు. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు పృథ్వీ  షా(20), మయాంక్‌ అగర్వాల్‌(32) విఫలమైనప్పటికీ.. కెప్టెన్‌ కోహ్లి అర్ధసెంచరీ(51), శ్రేయాస్‌ అయ్యర్‌(107 బంతుల్లో 103: 11 ఫోర్లు, 1 సిక్సర్‌) మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. కోహ్లి సోధి బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయిన అనంతరం, క్రీజులోకి వచ్చిన లోకేష్‌ రాహుల్‌(64 బంతుల్లో 88: 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత అర్ధసెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్‌ చివర్లో జాదవ్‌ (26 పరుగులు) 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2 వికెట్లతో రాణించగా, గ్రాండ్‌ హోమ్‌, ఇష్‌ సోధి చెరో వికెట్‌ తీశారు. 

కాగా, భారత్‌ ఓటమితో.. శ్రేయాస్‌ అయ్యర్‌ వన్డేల్లో నమోదు చేసిన తొలి సెంచరీ వృథా అయ్యింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ వన్డేల్లో 21వ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మూడు వన్డేల సిరీస్‌లో మ్యాచ్‌ గెలిచిన న్యూజిలాండ్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది.


logo