శనివారం 28 మార్చి 2020
Sports - Feb 26, 2020 , 23:19:49

హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన భారతజట్టు..

హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన భారతజట్టు..

ఆస్ట్రేలియా: భారత మహిళల క్రికెట్‌ జట్టు టీ 20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత వుమెన్‌ జట్టు తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు నమోదు చేసింద. మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌ను 18 పరుగుల తేడాతో ఓడించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను కూడా 18 పరుగుల తేడాతో ఓడించింది. కాగా, భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌ జట్టుతో ఆడనుంది. ఇరు దేశాల మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ ల ముఖాముఖి పోరులో కివీస్‌ అమ్మాయిలు అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల్లోనూ వారే విజయం సాధించారు. కానీ, విండీస్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం భారత జట్టు.. న్యూజిలాండ్‌ జట్టుపై విజయం సాధించింది. 

భారత బ్యాట్స్‌వుమెన్‌, బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ హార్మన్‌ ప్రీత్‌ కౌర్‌ చెలరేగితే ఇండియా విజయానికి అడ్డులేనట్లే. గత రెండు మ్యాచ్‌ల్లోనూ హార్మన్‌ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరింది. యువ బ్యాట్స్‌వుమెన్‌ షెఫాలీవర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో 39 పరుగులు చేసిన షెఫాలీ.. ఆసీస్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌వుమెన్‌ రోడ్రిగెజ్‌ కూడా రెండు మ్యాచుల్లో 26, 34 పరుగులతో రాణించింది. జ్వరం కారణంగా స్టార్‌ బ్యాట్స్‌వుమెన్‌ స్మృతి మందాన గత మ్యాచ్‌లో ఆడలేకపోయింది. రేపటి మ్యాచ్‌కు స్మృతి అందుబాటులో ఉంటుంది. బౌలర్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌, శిఖా పాండే సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. 

కివీస్‌ మహిళల జట్టు కూడా సూపర్‌ ఫామ్‌లో ఉంది. వారిని ఓడించడం భారతజట్టుకు సవాలే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, భారత మహిళల జట్టు నాకౌట్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. రేపు ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.   


logo