ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 16, 2020 , 01:21:31

2021 ప్రపంచకప్‌లో భారత్‌

2021 ప్రపంచకప్‌లో భారత్‌

  • మెగాటోర్నీకి అమ్మాయిల అర్హత   
  • పాక్‌తో సిరీస్‌ రద్దు ఫలితం 

దుబాయ్‌: న్యూజిలాండ్‌ వేదికగా వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి భారత మహిళల జట్టు అర్హత సాధించింది. వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో గతేడాది జూలై, నవంబర్‌లో జరుగాల్సిన సిరీస్‌ రద్దు కావడంతో టీమ్‌ఇండియాకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ‘ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో సిరీస్‌ జరిగే వీలు లేకుండా పోయింది. ద్వైపాక్షిక సిరీస్‌ కోసం భారత ప్రభుత్వ అనుమతి ఉంటేనే తాము పాల్గొంటామంటూ బీసీసీఐ పేర్కొంది. ఇలా ముందే స్పష్టం చేయడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జెఫ్‌ అలార్‌డైస్‌, క్రిస్‌ టెట్లీ, జొనాథాన్‌ హాల్‌తో కూడిన ఐసీసీ టెక్నికల్‌ కమిటీ సిరీస్‌ను రద్దు చేస్తూ ఇరు జట్లకు మూడేసి పాయింట్లు కేటాయించింది. భారత్‌, పాక్‌ సిరీస్‌తో పాటు కొవిడ్‌-19 కారణంగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా, శ్రీలంక-న్యూజిలాండ్‌ల మధ్య సిరీస్‌లు క్యాన్సిల్‌ అయ్యాయి’ అని ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ తాజా నిర్ణయంతో ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్‌(17 పాయింట్లు)తో పాటు ఆస్ట్రేలియా(37), ఇంగ్లండ్‌ (29 పాయిం ట్లు), దక్షిణాఫ్రికా(25), భారత్‌(23) ప్రపంచకప్‌నకు బెర్తులు దక్కించుకున్నాయి. మిగిలిన స్థానాల కోసం పాకిస్థాన్‌(19), వెస్టిండీస్‌(13), శ్రీలంక(5)తో పాటు బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, థాయ్‌లాండ్‌, జింబాబ్వే, పపువా న్యూగినియా, అమెరికా, నెదర్లాండ్స్‌ మధ్య పోటీ ఉంది. ఇందులో నుంచి ఐదు జట్లు ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది. మిథాలీరాజ్‌ నేతృత్వంలోని భారత మహిళల జట్టు వెస్టిండీస్‌తో గతేడాది నవంబర్‌లో చివరి సిరీస్‌ ఆడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓ దశలో వెనుకబడ్డా 2-1తో విండీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది.


logo