మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 00:55:17

మొగ్గు మనవైపే..

మొగ్గు మనవైపే..

  • 62 పరుగుల ఆధిక్యంలో టీమ్‌ఇండియా
  • తొలి ఇన్నింగ్స్‌లో 244 ఆలౌట్‌
  • 191కే పరిమితమైన ఆసీస్‌
  • తిప్పేసిన అశ్విన్‌.. విజృంభించిన ఉమేశ్‌
  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 9/1

బ్యాట్స్‌మెన్‌ అసమాన పోరాటానికి..బౌలర్ల అనన్య సామాన్య కృషి తోడవడంతో.. టీమ్‌ఇండియా ముందంజలో నిలిచింది. పింక్‌ బంతి, ఫ్లడ్‌లైట్ల వెలుతురు, పేసర్ల విజృంభణ అనే చర్చల నడుమ అశ్విన్‌ తనపని తాను చేసుకెళ్లాడు. ప్రమాదకరమైన స్మిత్‌కు ముకుతాడు వేసిన అతడు.. గ్రీన్‌, హెడ్‌ల ముందరికాళ్లకు బంధం వేసి డగౌట్‌లో కూర్చోబెట్టాడు. బుమ్రా ఓపెనర్ల భరతం పడితే.. మిగిలిన పని ఉమేశ్‌ పూర్తిచేశాడు. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వికెట్‌ పడ్డా ముగ్గురు మొనగాళ్లు పుజారా, విరాట్‌, రహానే ఉన్నారనే నమ్మకంతో భారత్‌ రెండో రోజును సంతృప్తికరంగా ముగించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోతే..సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడుతుండడంతో మళ్లీ అరంగేట్రం చేసినట్టు ఫీలయ్యా. ఇటీవలి పరిస్థితులను చూస్తే ఇప్పట్లో టెస్టు క్రికెట్‌  సాధ్యం కాదనుకున్నా. కానీ మళ్లీ బరిలోకి దిగడం ఎంతో సంతోషంగా ఉంది. మ్యాచ్‌  జరుగుతున్న కొద్ది అడిలైడ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. త్వరగా 250 పరుగులు సాధిస్తే పైచేయి మాదే అవుతుంది. 

- అశ్విన్‌ 

అడిలైడ్‌: విదేశాల్లో పెద్దగా ఆకట్టుకోలేడనే అపవాదు ఉన్న భారత సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి డే అండ్‌ నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా మెరుగైన దశలో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే పరిమితమైన భారత్‌.. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుదురుకోనివ్వలేదు. అశ్విన్‌ (4/55), ఉమేశ్‌ యాదవ్‌ (3/40), జస్ప్రీత్‌ బుమ్రా (2/52) ధాటికి విలవిలలాడిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (99 బంతుల్లో 73 నాటౌట్‌; 10 ఫోర్లు), లబుషేన్‌ (47) మినహా మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పృథ్వీ షా (4) వికెట్‌ కోల్పోయి 9 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (5 బ్యాటింగ్‌)తో పాటు నైట్‌వాచ్‌మెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం (53)తో కలుపుకొని ఓవరాల్‌గా 62 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన కంగారూల ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి.

బెంబేలెత్తించిన బుమ్రా

బౌలర్లకు సహకారం లభిస్తున్న పిచ్‌పై ఉమేశ్‌, బుమ్రా చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి నాలుగు ఓవర్ల వరకు ఖాతా తెరువలేకపోయిన ఆసీస్‌.. పరుగు పరుగుకు పరితపించిపోయింది. 51 బంతులాడి 8 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ను 15వ ఓవర్‌లో బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తన మరుసటి ఓవర్‌లోనే బర్న్స్‌ (8)ను కూడా అదే రీతిన పెవిలియన్‌ బాట పట్టించాడు. 

అశ్విన్‌ రాకతో..

28 బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేసి క్రీజులో ఉన్న స్మిత్‌ను అశ్విన్‌ తన తొలి ఓవర్‌లోనే ఔట్‌ చేయడంతో ఆసీస్‌ ఆత్మరక్షణలో పడింది. కాసేపటికే హెడ్‌ (7)ను బుట్టలో వేసుకున్న అశ్విన్‌.. తొలి టెస్టు ఆడుతున్న కామెరూన్‌ గ్రీన్‌ (11)కు కూడా పెవిలియన్‌ బాట చూపెట్టాడు. దీంతో 79 పరుగులకే ఆసీస్‌ సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లబుషేన్‌కు కెప్టెన్‌ పైన్‌ జతకలవడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ కాస్త కుదుట పడింది. ఈ జోడీ పట్టుదల కనబర్చడంతో వికెట్ల పతనానికి అడ్డుకట్టపడింది. ఆరో వికెట్‌కు 32 పరుగులు జోడించాక ఉమేశ్‌ యాదవ్‌ ఈ జంటను విడదీశాడు. లబుషేన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ఉమేశ్‌.. అదే ఓవర్‌లో కమిన్స్‌ (0)ను కూడా బోల్తా కొట్టించాడు.

మరో 11 పరుగులే..

ఓవర్‌నైట్‌ స్కోరు 233/6తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ మరో 11 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. సాహా (9), అశ్విన్‌ (15) క్రితం రోజు స్కోర్ల వద్దే ఔట్‌ కాగా.. ఉమేశ్‌ (6), బుమ్రా (4 నాటౌట్‌), షమీ (0) వారిని అనుసరించారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌కు 4, కమిన్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. వీరిద్దరి ధాటికి అరగంటలోపే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 

అదే నిర్లక్ష్యం..

పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోలాగే.. తొలి టెస్టులోనూ టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బౌండరీ వద్ద చేతిలోకి వచ్చిన బంతిని బుమ్రా అనవసరంగా ఎగిరి వదిలేస్తే.. పృథ్వీ షా నేరుగా చేతిలో పడ్డ బంతిని అందుకోలేకపోయాడు. ఇవి కాకుండా మయాంక్‌ అగర్వాల్‌, వృద్ధిమాన్‌ సాహా కూడా క్యాచ్‌లు వదిలేశారు. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య కూడా ఫీల్డింగ్‌లో గొప్పగా చెప్పుకునేందుకు ఏదైనా మిగిలిందంటే అది విరాట్‌ కోహ్లీ అందుకున్న క్యాచే. ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ గాల్లోకి ఆడిన బంతిని మిడ్‌వికెట్‌లో కోహ్లీ అందుకున్న విధానం చూసి తీరాల్సిందే.

పైన్‌ పోరాటం..

ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా వెనుదిరిగినా.. బౌలర్ల అండతో పైన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్‌ అగర్వాల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన పైన్‌.. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. స్టార్క్‌ (15), లియాన్‌ (10), హజిల్‌వుడ్‌ (8)లను కాచుకుంటూ విలువైన పరుగులు జతచేసి భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించాడు. చివరి మూడు వికెట్ల సాయంతో పైన్‌ 80 పరుగులు జోడించడం విశేషం. 

ఆసీస్‌ తొలిసారిలా..


గులాబీ బంతితో ఇప్పటివరకు ఆడిన ఏడు టెస్టుల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా తొలిసారి టీమ్‌ఇండియా ముందు తడబడింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగే కంగారూలు.. భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. పింక్‌ టెస్ట్‌లో ఆసీస్‌ ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సమర్పించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం

అదే పొరబాటు.. 

తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించకుండానే వెనుదిరిగిన పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్‌లో అంతకంటే పేలవంగా ఆడాడు. పిచ్‌ ఎలా స్పందిస్తుందో కూడా ఆలోచించకుండా మరోసారి ఆసీస్‌కు అప్పనంగా వికెట్‌ అప్పగించాడు. ఇప్పటికే అతడి ఎంపికపై మాజీలు గుర్రుగా ఉన్న సమయంలో తన పేలవ ఆటతీరుతో జట్టులో చోటే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. శుక్రవారం 25 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉన్న సమయంలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. ఆచితూచి ఆడాల్సిన పృథ్వీ.. కమిన్స్‌ వేసిన గుడ్‌ లెంగ్త్‌ బంతిని ఢిఫెన్స్‌ ఆడబోయి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బ్యాట్‌ ముందుకు తీసుకొచ్చే లోపే బంతి లోపలికి దూసుకురావడం పృథ్వీ ఫుట్‌వర్క్‌ లోపాన్ని మరోసారి చాటింది.ఈ పూట గడిస్తేనే..

రెండు రోజుల్లోనే రెండు ఇన్నింగ్స్‌లు ముగిసిన డే అండ్‌ నైట్‌ టెస్టులో ఫలితం రావడం ఖయమే అని తేలిపోయింది. ప్రస్తుతానికి టీమ్‌ఇండియాదే పైచేయిలా కనిపిస్తున్నా.. శనివారం తొలి సెషన్‌ ఎలా సాగుతుందనే దానిపైనే ఈ మ్యాచ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటికే 62 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన రెండొందల పరుగుల మార్కును చేరుకోగలిగితే కంగారూలను కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు. అయితే కొత్త బంతితో స్టార్క్‌, కమిన్స్‌, హజిల్‌వుడ్‌ బుల్లెట్లను మనవాళ్లు ఎలా ఎదుర్కుంటారో చూడాలి. సాధారణంగా విరాట్‌ కోహ్లీ నైట్‌ వాచ్‌మెన్‌ను బ్యాటింగ్‌కు పంపేందుకు పెద్దగా ఇష్టపడడు. ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఆడలేని బంతులను ఓ బౌలర్‌ ఎలా ఆడగలడు అని ఎదురు ప్రశ్నించే విరాట్‌.. శుక్రవారం ఆట ముగిసేందుకు కొన్ని నిమిషాలే ఉన్న సమయంలో పృధ్వీ షా ఔటవడంతో బుమ్రాను బ్యాటింగ్‌కు దింపాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న బుమ్రా.. ఉదయం బ్యాట్‌తో ఎన్ని పరుగులు చేసినా అవి టీమ్‌ఇండియాకు బోనసే. 

రెండో రోజు ఆట ఆరంభంలో నాలుగు వికెట్లు చేతిలో ఉన్న టీమ్‌ఇండియా అరగంటలోపే ఆలౌటైంది. సాహా, అశ్విన్‌ క్రీజులో ఉండటంతో స్కోరు మూడొందలకు చేరువవుతుందేమో అని అంతా భావించినా.. అది సాధ్యపడలేదు. కేవలం 11 పరుగులే జోడించగలిగింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. టాపార్డర్‌ పెద్దగా రాణించకున్నా.. బౌలర్ల అండతో టిమ్‌పైన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఒక దశలో 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ కోలుకోగలిగింది. స్టార్క్‌తో కలిసి 27, లియాన్‌తో కలిసి 28, హజిల్‌వుడ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు 24 పరుగులు జోడించిన పైన్‌.. భారత్‌ ఆధిక్యానికి గండికొట్టాడు. ఈ క్రమంలో అతడు ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా దూకుడుగా ఆడిన విషయాన్ని భారత బ్యాట్స్‌మెన్‌ గుర్తించాలి. నయావాల్‌ చతేశ్వర్‌ పుజారా తొలి ఇన్నింగ్స్‌లో కనబర్చిన ఏకాగ్రతను కొనసాగిస్తూ.. స్ట్రయిక్‌రేట్‌తో సంబంధం లేకుండా క్రీజులో పాతుకుపోయి ఆసీస్‌ బౌలర్లను విసిగిస్తే.. మిగిలినవాళ్లు ఒత్తిడి లేకుండా ముందుకు సాగొచ్చు. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు సహకారం లభించే చాన్స్‌ ఉండటంతో లియాన్‌ను కాచుకోవాల్సిన అవసరం ఉంది. బుమ్రా, ఉమేశ్‌, అశ్విన్‌ను ఎదుర్కొంటూ 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కూడా కష్టమే. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌కా బాద్‌షాగా పేరున్న షమీను తక్కువ అంచనా వేస్తే ఆసీస్‌కు అసలుకే ఎసురు తప్పదు.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) స్టార్క్‌ 0, మయాంక్‌ (బి) కమిన్స్‌ 17, పుజారా (సి) లబుషేన్‌ (బి) లియాన్‌ 43, కోహ్లీ (రనౌట్‌) 74, రహానే (ఎల్బీ) స్టార్క్‌ 42, విహారి (ఎల్బీ) హజిల్‌వుడ్‌ 16, సాహా (సి) పైన్‌ (బి) స్టార్క్‌ 9, అశ్విన్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 15, ఉమేశ్‌ (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 6, బుమ్రా (నాటౌట్‌) 4, షమీ (సి) హెడ్‌ (బి) కమిన్స్‌ 0, ఎక్స్‌ట్రాలు: 18, మొత్తం: 244. వికెట్ల పతనం: 1-0, 2-32, 3-100, 4-188, 5-196, 6-206, 7-233, 8-235, 9-240, 10-244, బౌలింగ్‌: స్టార్క్‌ 21-5-53-4, హజిల్‌వుడ్‌ 20-6-47-1, కమిన్స్‌ 21.1-7-48-3, గ్రీన్‌ 9-2-15-0, లియాన్‌ 21-2-68-1, లబుషేన్‌ 1-0-3-0. 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వేడ్‌ (ఎల్బీ) బుమ్రా 8, బర్న్స్‌ (ఎల్బీ) బుమ్రా 8, లబుషేన్‌ (ఎల్బీ) ఉమేశ్‌ 47, స్మిత్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 1, హెడ్‌ (సి అండ్‌ బి) అశ్విన్‌ 7, గ్రీన్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 11, పైన్‌ (నాటౌట్‌) 73, కమిన్స్‌ (సి) రహానే (బి) ఉమేశ్‌ 0, స్టార్క్‌ (రనౌట్‌) 15, లియాన్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 10, హజిల్‌వుడ్‌ (సి) పుజారా (బి) ఉమేశ్‌ 8, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 191. వికెట్ల పతనం: 1-16, 2-29, 3-45, 4-65, 5-79, 6-111, 7-111, 8-139, 9-167, 10-191, బౌలింగ్‌: ఉమేశ్‌ 16.1-5-40-3, బుమ్రా 21-7-52-2, షమీ 17-4-41-0, అశ్విన్‌ 18-3-55-4. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ (బి) కమిన్స్‌ 4, మయాంక్‌ (నాటౌట్‌) 5, బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 9/1. వికెట్ల పతనం: 1-7, బౌలింగ్‌: స్టార్క్‌ 3-1-3-0, కమిన్స్‌ 3-2-6-1.


logo