ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 00:16:27

భారత్‌ స్వర్ణ చరిత్ర ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌

భారత్‌ స్వర్ణ చరిత్ర  ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌

చెన్నై: భారత చెస్‌ ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు తొలిసారి పసిడి పతకంతో మెరిసింది. కరోనా వైరస్‌ కారణంగా మొదటిసారి ఆన్‌లైన్‌లో జరిగిన టోర్నీలో రష్యాతో కలిసి భారత్‌ ఉమ్మడి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు దివ్య దేశ్‌ముఖ్‌, నిహాల్‌ సరీన్‌ ఇంటర్నెట్‌ సమస్య కారణంగా ఓటమి పాలవడంతో.. నిర్వాహకులు ఇరు జట్లను విజేతగా ప్రకటించారు. సర్వర్‌లో ఏర్పడిన సమస్యను భారత ఆటగాళ్లు నిర్వహకుల దృష్టికి తీసుకెళ్లారు. చెస్‌ ఒలింపియాడ్‌లో మన జట్టుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. 2014లో భారత జట్టుకు కాంస్యం దక్కిన విషయం తెలిసిందే. తొలి రౌండ్‌ను 3-3తో భారత్‌ డ్రా చేసుకోగా..రెండో రౌండ్‌ను రష్యా 4.5-1.5తో గెలిచింది. ఎసిపెంకో..సరీన్‌పై, పోలినా షువలోవా..దేశ్‌ముఖ్‌పై గెలిచారు. అయితే సర్వర్‌ సమస్య కారణంగా తాము ఓడిపోయామంటూ భారత్‌ తమ వాదనను బలంగా వినిపించింది. ఈ విషయాన్ని ఫిడే అప్పీల్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లగా నిర్వాహకులు ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  అభినందనలు తెలిపారు. 


logo