బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 23:31:23

క్వార్టర్స్‌లో ఆసీస్‌తో

క్వార్టర్స్‌లో ఆసీస్‌తో
  • చివరి లీగ్‌ మ్యాచ్‌లో కివీస్‌ చిత్తుచేసిన యువ భారత్‌..
  • అండర్‌-19 ప్రపంచకప్‌

బ్లూమ్‌ఫాంటైన్‌: అండర్‌-19 ప్రపంచకప్‌లో జోరుమీదున్న యువ భారత్‌ అజేయంగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌కు ముందే నాకౌట్‌కు అర్హత సాధించిన భారత అండర్‌-19 జట్టు.. గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి (డీఎల్‌ఎస్‌) ప్రకారం 44 పరుగుల తేడాతో గెలుపొందింది. క్వార్టర్స్‌లో యువ భారత్‌.. ఆస్ట్రేలియా జట్టుతో తలపడనున్నది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ప్రియం గార్గ్‌ సేన 23 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 115 పరుగులు చేసిన దశలో భారీ వర్షం ముంచెత్తింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (57 నాటౌట్‌), దివ్యాన్ష్‌ (52 నాటౌట్‌) అజేయ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. రెండు గంటలకు పైగా ఆటకు అంతరాయం కలగడంతోడీఎల్‌ఎస్‌ ప్రకారం న్యూజిలాండ్‌కు 23 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కాగా లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ జట్టు 21 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌ (4/30), అథర్వ అంకొలేకర్‌ (3/28) ధాటికి రైస్‌ ఆండ్రే  (42), లేల్‌మన్‌ (31) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. రవికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.


logo