ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 29, 2020 , 00:29:51

కెవ్వు కార్తీక్‌

కెవ్వు కార్తీక్‌

బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌, అథర్వ అంకొలేకర్‌ విజృంభిస్తే.. బౌలింగ్‌లో కార్తీక్‌ త్యాగి విశ్వరూపం ప్రదర్శించాడు. ఫలితంగా అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ వరుసగా మూడో సారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కఠిన ప్రత్యర్థిపై తక్కువ స్కోరుచేసి కూడా బౌలింగ్‌లో విజృంభించిన ప్రియం గార్గ్‌ సేన టైటిల్‌ నిలబెట్టుకునేందుకు రెండడుగుల దూరంలో నిలిచింది.

  • నాలుగు వికెట్లతో విజృంభణ
  • సెమీస్‌లో యువ భారత్‌
  • క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా చిత్తు
  • అండర్‌-19 ప్రపంచకప్‌

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగ్గట్లు దూసుకెళ్తున్న యువ భారత్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 74 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన ప్రియం గార్గ్‌ సేన టైటిల్‌కు మరింత చేరువైంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత అండర్‌-19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (82 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అథర్వ అంకొలేకర్‌ (54 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించగా.. రవి బిష్ణోయ్‌ (30), సిద్ధేశ్‌ వీర్‌ (25) ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 43.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' కార్తీక్‌ త్యాగి (4/24) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కంగారూలు ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్‌ సామ్‌ ఫనింగ్‌ (75) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టాడు.


‘జై’స్వాల్‌

లీగ్‌ దశలో దుమ్మురేపిన భారత టాపార్డర్‌.. కీలక మ్యాచ్‌లో విఫలమైంది. దివ్యాన్ష్‌ సక్సేనా (14), తిలక్‌ వర్మ (2), కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ (5), ధృవ్‌ జురేల్‌ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నిలకడగా ఆడటంతో మన జట్టు కోలుకోగలిగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడిన జైస్వాల్‌.. స్కోరును మూడంకెలు దాటించి ఔటయ్యాడు. మిడిలార్డర్‌లో సిద్ధేశ్‌ వీర్‌, అంకొలేకర్‌, రవి బిష్ణోయ్‌ రాణించడంతో భారత్‌ మంచి స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా అథర్వ చక్కటి షాట్లతో సత్తాచాటాడు. ఆసీస్‌ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. 


రెండు ఓవర్లు.. ఆరు వికెట్లు

చేసిందేమో తక్కువ స్కోరు.. ఎదురుగా పటిష్ఠ ఆస్ట్రేలియా జట్టు.. ఇంకేముంది మెగాటోర్నీలో మన పోరాటం ముగిసినట్లేనన్న అనుమానాల మధ్య ఫీల్డింగ్‌కు దిగిన యువ భారత్‌ తొలి పది నిమిషాల్లోనే మ్యాచ్‌పై పట్టు సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోతున్న కార్తీక్‌ త్యాగి తొలి ఓవర్‌లోనే మ్యాచ్‌ను మనవైపునకు తిప్పాడు. ఇన్నింగ్స్‌ మొదటి బంతికే లేని పరుగు కోసం యత్నించిన మెక్‌ గర్క్‌ (0) రనౌటైతే.. కెప్టెన్‌ మెకంజీ హార్వే (4), హెర్నే (0) వరుస బంతుల్లో పెవిలియన్‌ బాటపట్టారు. 


హార్వే వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోతే.. కార్తీక్‌ సంధించిన సూపర్‌ యార్కర్‌కు నోరేళ్లబెట్టడం హెర్నే వంతైంది. తన రెండో ఓవర్‌లో  దవీస్‌ (2)ను కూడా కార్తీక్‌ ఔట్‌ చేయడంతో ఆస్ట్రేలియా 17/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్కడి నుంచి ఓపెనర్‌ ఫనింగ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత భుజానెత్తుకోగా.. రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చిన కార్తీక్‌ పాట్రిక్‌ రోవ్‌ (21)ను కూడా పెవిలియన్‌ బాట పట్టించాడు. కార్తీక్‌తో పాటు లెఫ్టార్మ్‌ మేసర్‌ ఆకాశ్‌ సింగ్‌ (3/30) కూడా సత్తాచాటడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌లో ఫనింగ్‌, రోవ్‌, స్కాట్‌ (35) మినహా తక్కిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యా రు. ఆకాశ్‌ వేసిన 42వ ఓవర్లో ఓ రనౌట్‌ సహా మూడు వికెట్లు పడటంతో ఆసీస్‌ ఓటమి ఖాయమైంది.


సంక్షిప్త స్కోర్లు

భారత అండర్‌-19 జట్టు: 233/9 (యశస్వి 62, అంకొలేకర్‌ 55 నాటౌట్‌, రవి 30; టాడ్‌ మర్పీ 2/40, కెల్లీ 2/45). 

ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు: 43.3 ఓవర్లలో 159 ఆలౌట్‌ (ఫనింగ్‌ 75; కార్తీక్‌ 4/24, ఆకాశ్‌ 3/30).


logo