గులాబీ వార్

- నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు
- శుభారంభం కోసం ఇరు జట్ల తహతహ
- ఓపెనర్‌గా పృథ్వీ షా.. కీపర్‌గా సాహా
ప్రతీకారం తీర్చుకోవాలని ఒకరు.. పట్టు నిలుపుకోవాలని మరొకరు..గత పర్యటనలో ఎదురైన గాయాలకు మందు రాయాలని ఒకరు.. అదే పుండుపై కారం చల్లి మరింత మంట పెట్టాలని మరొకరు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి నేడు తెరలేవనుంది. తొలి పోరే గులాబీ బంతితో ఫ్లడ్‌లైట్ల వెలుతురు మధ్య కదనరంగంలో కలబడేందుకు అటు కంగారూలు, ఇటు కోహ్లీసేన సిద్ధమవుతున్నాయి. టీమ్ఇండియాకు విరాట్, పుజారా, బుమ్రా, షమీ ఉంటే.. ఆసీస్‌ను ఆదుకునేందుకు స్మిత్, లబుషేన్, స్టార్క్, కమిన్స్ సై అంటున్నారు. డే అండ్ నైట్ మ్యాచ్ కదా తాపీగా చూద్దాంలే అనుకుంటే పొరబడినట్లే.. ఫ్లడ్‌లైట్ల మధ్య సాగే మ్యాచ్ ఆసీస్‌లో కాబట్టి మీరు ఈ వార్త చదివేసరికి పోరు ప్రారంభమయ్యే అవకాశాలూ ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం టీవీలను ట్యూన్ చేసేయండి..
అడిలైడ్: సుదీర్ఘ పర్యటన కోసం ఆసీస్‌లో అడుగుపెట్టిన భారత జట్టు.. పరిమిత ఓవర్ల సిరీస్‌లను ముగించుకొని ప్రతిష్టాత్మక టెస్టు పోరుకు రెడీ అయింది. వన్డే సిరీస్‌ను కంగారూలు గెలుచుకుంటే.. టీ20 సిరీస్ దక్కించుకున్న కోహ్లీ సేన లెక్క సరిచేసింది. ఇక మిగిలింది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. గత పర్యటనలో స్మిత్, వార్నర్ లేని ఆసీస్ జట్టుపై సిరీస్ నెగ్గి ట్రోఫీ చేజిక్కించుకున్న టీమ్ఇండియా దాన్ని అట్టి పెట్టుకోవాలని భావిస్తుంటే.. దెబ్బకు దెబ్బ తీసి ట్రోఫీ తిరిగి దక్కించుకోవాలని ఆసీస్ తహతహలాడుతున్నది. నాలుగు టెస్టుల్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా తొలి డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం కానుంది. సొంతగడ్డపై అచ్చొచ్చిన గులాబీ బంతితో మ్యాచ్ అంటే కంగారూలకే కలిసొచ్చేలా కనిపిస్తున్నా.. ఆజట్టు ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతుండటం టీమ్ఇండియాకు అనుకూలించే చాన్స్ ఉంది. ఫలితం ఎలా ఉన్నా.. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించడం మాత్రం ఖాయమే. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల బలాబలాలు, లోటు పాట్లను ఓసారి పరిశీలిస్తే..
పంత్‌ను పక్కనపెట్టి
మ్యాచ్‌కు ముందు రోజే తుది జట్టును ప్రకటించిన టీమ్ఇండియా.. ఆటగాళ్లను ఆచితూచి ఎంపిక చేసుకుంది. మయాంక్‌తో పాటు మరో ఓపెనర్‌గా గిల్‌ను కాదని పృథ్వీ షాకు అవకాశం ఇచ్చింది. ఇక వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను పక్కనపెట్టి సీనియర్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహాకే ఓటు వేసింది. షమీ, బుమ్రా, ఉమేశ్ రూపంలో ముగ్గురు పేసర్లకు చాన్సిచ్చిన భారత్.. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ వైపు మొగ్గు చూపింది. జట్టు కూర్పు నేపథ్యంలో లోకేశ్ రాహుల్‌ను పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం. మొత్తానికి ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్.. ఇద్దరు ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్లు.. ఓ వికెట్ కీపర్.. ము గ్గురు పేసర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తున్నది.
నవ భారతానికి ప్రతినిధిని
కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉంటానని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అదే రీతిలో ముందుకు సాగుతున్న నూతన భారతానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా బుధవారం వర్చువల్ మీడియా సమావేశంలో విరాట్ మాట్లాడాడు. ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాయేతర క్రికెటర్లలో తనను ఆల్‌టైమ్ ఆటగాడని చెప్పిన గ్రెగ్ చాపెల్ వ్యాఖ్యలపై స్పందించాడు. ‘నేను ఎప్పుడూ నాలాగే ఉంటా. నేను న్యూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది. ఆస్ట్రేలియన్ల ఆలోచనా తీరుతో ఎప్పటికీ పోల్చుకోను. సవాళ్లను ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో నవ భారతం ఎదుర్కొంటోంది. అదేవిధంగా మాకు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం’ అని కోహ్లీ చెప్పాడు. కాగా తన గైర్హాజరీలో చివరి మూడు టెస్టుల్లో కెప్టెన్‌గా అజింక్య రహానే అద్భుతంగా రాణిస్తాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
స్లెడ్జింగ్ అనవసరం
మైదానంలో స్లెడ్జింగ్ అనేది అర్థరహితమని కోహ్లీ చెప్పాడు. దీనివల్ల అనవసరంగా ఆటగాళ్లు, జట్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని అభిప్రాయపడ్డాడు.
వీరిపై ఓ కన్నేయండి..
విరాట్, పుజారా, రహానే.. టీమ్ఇండియా బ్యాటింగ్ మూలస్తంభాలివే. ఈ ముగ్గురు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఆసీస్‌పై భారత్ ఆధిపత్యం సాధించొచ్చు. గత పర్యటనలో కోహ్లీ, రహానే పెద్దగా ఆకట్టుకోక పోయినా.. పుజారా మాత్రం మారథాన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రానున్న కోహ్లీ అడిలైడ్‌లో అదరగొట్టేందుకు సిద్ధమవుతుంటే.. రహానే చాపకింద నీరులా కంగారూలను చుట్టేయడానికి రెడీగా ఉన్నాడు. వీరితో పాటు మయాంక్, పృథ్వీ, విహారి కూడా తమ బ్యాట్లకు పనిచెబితే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా, షమీపైనే ఎక్కువ భారం ఉండనుంది.
బలహీనతలు..
- పింక్ బంతితో పెద్దగా ఆడిన అనుభవం లేకపోవడం టీమ్ఇండియాను కలవరపెడుతుండగా.. ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉన్న ఇషాంత్ శర్మ దూరమవడం కూడా భారత్‌ను ఇబ్బందుల్లో పడేసింది.
- ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచే డే అండ్ నైట్ కావడం కూడా ప్రతికూలాంశమే.
- మొదటి టెస్టు అనంతరం విరాట్ జట్టుకు దూరమవనుండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం కాస్త తేడా కొట్టినా.. మొత్తం సిరీస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- పెద్దగా అనుభవం లేని ఓపెనర్లు మయాంక్, పృథ్వీషా.. స్టార్క్, కమిన్స్, హజిల్‌వుడ్ వంటి పేసర్లను ఎదుర్కోనుండటం.
- హార్దిక్ పాండ్యా వంటి పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడం.
పుజారాపైనే ఆశలు..
గత ఆసీస్ పర్యటనలో చతేశ్వర్ పుజారా.. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన పుజ్జీ ఏకంగా 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఆసీస్‌లో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఓ విదేశీ ఆటగాడు ఇన్ని బంతులు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. పుజారా ఏకాగ్రతకు వణికిపోయిన ఆసీస్ ఆటగాళ్లు ఒక దశలో ‘నీకు బోర్ కొట్టదా.. నువ్వు ఇలాగే ఆడితే మేము వీల్ చైర్స్పై కూర్చొని ఫీల్డింగ్ చేస్తాం’అన్నారంటే అతడు కంగారూలను ఎంతగా కలవరపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
వీళ్లే కీలకం..
టీమ్ఇండియాతో మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చినట్లు రెచ్చిపోయే స్టీవ్ స్మిత్‌తో పాటు.. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చి కీలక ఆటగాడిగా ఎదిగిన లబుషేన్ ప్రదర్శనపైనే ఆసీస్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్మిత్.. భారత్‌తో వన్డే సిరీస్‌లో మాత్రం చెలరేగిపోయాడు. వరుస మ్యాచ్‌ల్లో రెండు మెరుపు శతకాలు కొట్టి ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. క్రీజులో బ్రేక్ డ్యాన్స్ చేసే స్మిత్‌ను అడ్డుకుంటేనే టీమ్ఇండియా విజయావకాశాలు మెరుగవుతాయి.
లోటుపాట్లు..
- గాయాల కారణంగా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు దేశవాళీల్లో అదరగొట్టిన పుకోస్కీ అడిలైడ్ టెస్టుకు దూరం కావడం.
- చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన వేడ్‌కు ఈ ఫార్మాట్లో చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడం.
- మిడిలార్డర్లో అనుభవలేమి. స్మిత్ తర్వాత బ్యాటింగ్‌కు రానున్న హెడ్, గ్రీన్, పైన్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడం.
- తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన కామెరున్ గ్రీన్.. వామప్ మ్యాచ్‌లో గాయపడటం.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, పుజారా, అజింక్య రహానే, విహారి, సాహా, అశ్విన్, మహమ్మద్ షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు (అంచనా): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హజిల్‌వుడ్, లియాన్.
తాజావార్తలు
- వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
- షూటింగ్ వల్లే ఆలియా భట్ అలసిపోయిందా ?
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
- రిషబ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు