బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 02, 2020 , 06:31:44

వైట్‌ వాష్‌పై గురి

వైట్‌ వాష్‌పై గురి
  • నేడు భారత్‌, న్యూజిలాండ్‌ ఆఖరి టీ20
  • మధ్యాహ్నం 12.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

మౌంట్‌ మాంగనీ: వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కివీస్‌లో పొట్టి సిరీస్‌ నెగ్గని భారత జట్టు.. ఏకంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడానికి అడుగు దూరంలో నిలిచింది. రెండు ‘సూపర్‌' థ్రిల్లర్‌ విజయాలతో కొండంత ఆత్మవిశ్వాసం నింపుకున్న భారత్‌.. ఆదివారం ఐదో టీ20లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా పోటీనివ్వలేకపోయిన బ్లాక్‌క్యాప్స్‌.. మలి రెండు మ్యాచ్‌ల్లో పోరాడినా.. ఒత్తిడిని జయించలేక ఓటమి పక్షాన నిలువాల్సి వచ్చింది. మరి చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కివీస్‌ పరువు నిలబెట్టుకుంటుందా చూడాలి. 


ఎట్టకేలకు పంత్‌కు చోటు!

సిరీస్‌ చేతికి రాగానే బెంచ్‌ బలాన్ని పరీక్షించుకునే పనిలోపడ్డ భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ దాన్ని కొనసాగించనుంది. సిరీస్‌లో ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు ఈ మ్యాచ్‌లో ఆ అవకాశం రానుంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌కు రెస్ట్‌ ఇచ్చి అతడి స్థానంలో పంత్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. బౌలింగ్‌లోనూ చాహల్‌కు విశ్రాంతినిచ్చి కుల్దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేయొచ్చు. కోహ్లీ రెస్ట్‌ తీసుకుంటే.. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు చేపడతాడు. చాన్నాళ్ల తర్వాత అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్‌ నాలుగో టీ20లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను బెదరగొట్టే లక్ష్యంతో బ్యాటింగ్‌ చేస్తున్న శాంసన్‌.. కాస్త సంయమనం వహించాల్సిన అవసరముంది. తనదైన ముద్ర వేయకపోతే అతడికి ఇదే చివరి చాన్స్‌ కావచ్చు.  జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.


కలిసొచ్చే స్టేడియంలోనైనా..!

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన కివీస్‌ సిరీస్‌లో బోణీ మాత్రం కొట్టలేకపోయింది. అయితే చివరి మ్యాచ్‌ జరుగనున్న బే ఓవల్‌ మైదానంలో కివీస్‌కు మంచి రికార్డు ఉండటం కలిసొచ్చే అంశం. టీ20ల్లో న్యూజిలాండ్‌ అత్యధిక స్కోరు (243/5; 2018లో వెస్టిండీస్‌పై) చేసింది ఇక్కడే. 


5
ఇక్కడ జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలుపొందాయి.logo
>>>>>>