ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 13, 2021 , 17:13:14

అదరగొట్టిన రోహిత్..భార‌త్ 300/6

 అదరగొట్టిన రోహిత్..భార‌త్ 300/6

చెన్నై: ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న  రెండో టెస్టులో  హిట్‌మ్యాన్   రోహిత్ శ‌ర్మ(161: 231 బంతుల్లో 18ఫోర్లు, 2సిక్స‌ర్లు) అద్భుత సెంచ‌రీతో  అద‌ర‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆక‌ట్టుకున్నాడు. మ‌రో బ్యాట్స్‌మన్ ర‌హానె(67: 149 బంతుల్లో 9ఫోర్లు)తో క‌లిసి  భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. వీరిద్ద‌రూ  162   ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.   తొలిరోజు, శ‌నివారం ఆట ముగిసేస‌మ‌యానికి భార‌త్ 88 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది.  ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్‌(33 56 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), అక్ష‌ర్ ప‌టేల్‌(5) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జాక్ లీచ్, మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు తీయ‌గా జో రూట్‌, ఓలీ స్టోన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు తొలి సెష‌న్‌లోనే ఇంగ్లాండ్ పెద్ద షాకిచ్చింది. భార‌త్ ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే  వికెట్ చేజార్చుకున్న‌ది.   ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లోనే ఒలీ స్టోన్ బౌలింగ్‌లో యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(0)‌ను ఎల్బీగా  వెనుదిరిగాడు. ఈ ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన పుజారా(21) మ‌రో ఓపెన‌ర్ రోహిత్‌కు స‌హ‌కారం అందించాడు. రోహిత్ వన్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేస్తుండ‌గా పుజారా కూడా నిల‌క‌డ‌గా ఆడాడు. క్రీజులో కుదురుకున్న జోడీని జాక్ లీచ్ విడ‌దీశాడు. 21వ ఓవ‌ర్లో   పుజారా ఔట‌వ‌గా కెప్టెన్ విరాట్  కోహ్లీ(0) బ్యాటింగ్‌కు వ‌చ్చాడు.

ప్ర‌మాద‌క‌ర కోహ్లీని స్పిన్న‌ర్ మొయిన్ అలీ  మెరుపు   బంతితో బౌల్డ్ చేశాడు. అస‌లు తాను ఎలా ఔట‌య్యానోన‌ని కోహ్లీ రివ్యూ కూడా కోరాడు.  ఆఫ్‌స్టంప్ వైపు వేసిన బంతి అనూహ్యంగా ట‌ర్న్ తీసుకొని వికెట్ల‌ను తాకిన‌ట్లు రీప్లేలో తేలింది.  కోహ్లీ క‌వ‌ర్ డ్రైవ్ ఆడాల‌నుకున్నాడు.  ఎన్నో ఆశ‌ల‌తో క్రీజులోకి వ‌చ్చిన కోహ్లీ  డ‌కౌట్‌గానే పెవిలియ‌న్ చేరాడు.  ఈ ద‌శ‌లో క్రీజులో ఉన్న రోహిత్‌, ర‌హానె  మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు. రెండో సెష‌న్ మొత్తం భార‌త్‌దే ఆధిప‌త్యం.

హిట్‌మ్యాన్ బౌండ‌రీల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. చాలా వేగంగా శ‌త‌కం సాధించిన రోహిత్ డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్లాడు. టీమ్ ఇండియా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు కీల‌క   వికెట్లు కోల్పోయింది.   రోహిత్   జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.  మొయిన్ అలీ వేసిన 76వ ఓవ‌ర్లోనే ర‌హానె  బౌల్డ్ అయ్యాడు.  చివ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అశ్విన్ త్వ‌ర‌గానే ఔట‌య్యాడు. మ‌రో ఎండ్‌లో పంత్ మాత్రం త‌న‌దైన శైలిలో హిట్టింగ్ చేసి స్కోరు 300 దాటించాడు. 

VIDEOS

logo