గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 00:20:48

యశస్విజయం

యశస్విజయం

అజేయ శతకంతో అదరగొట్టిన జైస్వాల్‌.. సెమీస్‌లో పాక్‌పై 10 వికెట్లతో భారత్‌ జయభేరి ఏడోసారి ఫైనల్లో యంగ్‌ఇండియా.. అండర్‌-19 ప్రపంచకప్‌ కార్తీక్‌ యార్కర్లు.. బిష్ణోయ్‌ గూగ్లీలు.. యశస్వి సిక్సర్లు.. దివ్యాన్ష్‌ బౌండ్రీలు..యువభారత్‌ జోరు.. ప్రత్యర్థి పాకిస్థాన్‌ బేజారు.. సెమీఫైనల్లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ కావడంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ ఇంటిముఖం పట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగ్గట్లు దూసుకెళ్తున్న యంగ్‌ఇండియా వరుసగా మూడోసారి తుదిపోరుకు చేరింది. మనవాళ్లు వీరలెవల్లో విజృంభించి ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన చోట పాక్‌ జట్టు ఒక్క వికెట్‌ తీసేందుకు నానా తంటాలు పడింది. వాళ్ల బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలదొక్కుకోలేక తైతక్కలాడిన చోట మనవాళ్లు పరుగుల వరద పారిస్తూ సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టారు.

  • అండర్‌-19 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో
  • ఒక జట్టు 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇదే తొలిసారి.

పోచెఫ్‌స్ట్రూమ్‌: యంగ్‌ తరంగ్‌ యశస్వి జైస్వాల్‌ (113 బంతుల్లో 105 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను తుక్కుకింద కొట్టిన యువ భారత జట్టు వరుసగా మూడోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై జయభేరి మోగించి ఓవరాల్‌గా ఏడోసారి మెగాటోర్నీ తుదిపోరుకు అర్హత సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 43.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ నజీర్‌ (62), ఓపెనర్‌ హైదర్‌ అలీ (56) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో సుశాంత్‌ మిశ్రా 3, కార్తీక్‌ త్యాగి, రవి బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యశస్వితో పాటు మరో ఓపెనర్‌ దివ్యాన్ష్‌ సక్సేనా (99 బంతుల్లో 59 నాటౌట్‌; 6 ఫోర్లు) అర్ధశతకంతో అదరగొట్టడంతో యువ భారత్‌ 35.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 176 పరుగులు చేసింది. యశస్వికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్దు దక్కింది. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో ప్రియంగార్గ్‌ సేన ఫైనల్లో తలపడనుంది.


వాళ్లిద్దరే..

ఈ మెగాటోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఇప్పటి వరకు ఆరుసార్లు ఫైనల్‌ చేరి నాలుగు సార్లు ట్రోఫీ ముద్దాడిన యువ భారత్‌.. ఇప్పుడు ఏడోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఇంటిదారి పట్టించిన గార్గ్‌ గ్యాంగ్‌.. సెమీస్‌లో పాక్‌కు చుక్కలు చూపింది. క్రితం సారి పాక్‌పై శుభ్‌మన్‌ గిల్‌ శతక్కొడితే.. ఈ సారి ఆ బాధ్యత యశస్వి తీసుకున్నాడు. టాస్‌ నెగ్గిన పాక్‌కు శుభారంభం దక్కలేదు. 34 పరుగులకే ఆ జట్టు హురేరా (4), మునీర్‌ (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హైదర్‌ అలీ, నజీర్‌ కాసేపు ప్రతిఘటించారు. ఒక్కసారి ఈ భాగస్వామ్యం విడిపోయాక.. పాక్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.  26 పరుగుల వ్యవధిలో పాకిస్థాన్‌ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం గమనార్హం.


వీళ్లిద్దరే..

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా.. లక్ష్యం చిన్నదే అయినా యువ భారత్‌ ఎక్కడా తొందరపాటుకు పోలేదు. ఒక్కసారి కుదురుకున్నాక జైస్వాల్‌ జూలు విదిల్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరో ఎండ్‌లో బంతిని ఆలస్యంగా ఆడుతూ దివ్యాన్ష్‌ కూడా చక్కటి సహకారం అందించాడు. దీంతో చూస్తుండగానే మ్యాచ్‌ మన చేతుల్లోకి వచ్చేసింది. చివర్లో యశస్వి సెంచరీ పూర్తవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొన్నా భారీ సిక్సర్‌తో అతడు శతకం పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.

ప్రపంచకప్‌ సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై సెంచరీ చేయడం.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా కల నిజమైనట్లు అనిపిస్తున్నది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇలాంటి ప్రదర్శన చేసినందుకు ఆనందంగా ఉంది. 

-యశస్వి జైస్వాల్‌


logo