సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 04:14:25

దాయాదుల పోరు

దాయాదుల పోరు

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పోరంటే.. అది ఏ ఆటైనా అందులో ఉన్న మజానే వేరు. మరీ ముఖ్యంగా క్రికెట్‌ అయితే.. అందులోనూ వరల్డ్‌కప్‌లాంటి మెగాటోర్నీ అయితే ఇక ఆ ఉత్కంఠ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు యువ భారత్‌ సిద్ధమైంది. దాయాదిని చితక్కొట్టి వరుసగా రెండోసారి విశ్వకప్పును ముద్దాడాలని ప్రియం గార్గ్‌ సేన చూస్తుంటే.. భారత్‌ను కట్టడి చేసి తుదిపోరుకు చేరాలని పాక్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి కీలక పోరులో పైచేయి సాధించేదెవరో.. అద్వితీయ ప్రదర్శనతో తమ జట్టును ఫైనల్‌కు చేర్చేదెవరో నేడు తేలనుంది.

  • నేడు సెమీఫైనల్లో భారత్‌, పాక్‌ అమీతుమీ.. అండర్‌-19 ప్రపంచకప్‌
  • మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అండర్‌-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన యువ భారత్‌ అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తూ.. సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం జరుగనున్న మెగాటోర్నీ తొలి సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేందుకు ప్రియం గార్గ్‌ సేన రెడీ అయింది. గత రెండు పర్యాయాలు ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన యువ భారత జట్టు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతుంటే.. 2010 మెగాటోర్నీ తర్వాత భారత్‌పై ఒక్కసారి కూడా గెలువని పాకిస్థాన్‌ ఈ సారి ముందంజ వేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న గార్గ్‌ గ్యాంగ్‌ను అడ్డుకోవాలంటే పాక్‌ శక్తికి మించి పోరాడక తప్పదు. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లు నెగ్గిన భారత్‌.. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేస్తే.. లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌లు నెగ్గి మరో మ్యాచ్‌ రద్దు కావడంతో క్వార్టర్స్‌ చేరిన పాక్‌ జట్టు ఆక్కడ ఆఫ్ఘానిస్థాన్‌ను మట్టికరిపించింది. ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా.. ఈ మ్యాచ్‌ను కూడా ఓ సాధారణ పోరులానే భావిస్తామని పాక్‌ ఓపెనర్‌ హురేరా చెబుతున్నా.. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ భారత్‌, పాక్‌ సెమీఫైనల్లో తలపడగా.. శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో యువ భారత్‌ జయభేరి మోగించింది.


యశస్విపైనే భారం

బ్యాటింగ్‌లో భారత జట్టు బలంగా కనిపిస్తున్నా.. లెఫ్టార్మ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పైనే ఎక్కువ ఆధార పడుతున్నదనేది కాదనలేని వాస్తవం. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతడు మూడు అర్ధశతకాలు బాదాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న యశస్వి మరోసారి యాంకర్‌ రోల్‌ పోషిస్తే.. యువ భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయమే. దివ్యాన్ష్‌ సక్సేనా, తిలక్‌ వర్మ, ప్రియం గార్గ్‌, ధృవ్‌ జురేల్‌, సిద్ధేశ్‌ వీర్‌ సమిష్టిగా రాణించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటున్నది. క్వార్టర్‌ ఫైనల్లో లోయర్‌ ఆర్డర్‌ ఆదుకోవడంతో మంచి స్కోరు చేయగలిగిన భారత్‌.. ఈ సారి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవద్దని భావిస్తున్నది. బౌలింగ్‌లో యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగీ 140 కిలోమీటర్లకు తగ్గని వేగంతో దుమ్మురేపుతుంటే.. రవి బిష్ణోయ్‌, అథర్వ అంకొలేకర్‌ తిప్పేస్తున్నారు. ఆకాశ్‌ సింగ్‌, సుశాంత్‌ మిశ్రా కూడా మంచి జోరు మీదున్నారు. పోచెఫ్‌స్ట్రూమ్‌ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తూ.. బిష్ణోయ్‌ బంతులను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే.


బౌలింగే బలంగా..

మరోవైపు పాకిస్థాన్‌ జట్టులో కెప్టెన్‌ నజీర్‌కు గతంలో ప్రపంచకప్‌ ఆడిన అనుభవం ఉంది. క్రితం సారి (2018లో) భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో అతడు శుభ్‌మన గిల్‌ క్యాచ్‌ వదిలేయడం.. ఆ తర్వాత గిల్‌ శతక్కొట్టడంతోనే మ్యాచ్‌ పాక్‌ చేతి నుంచి జారిపోయింది. ఈ సారి అలాంటి తప్పిదాలు జరుగకుండా జాగ్రత్త పడుతామని ముందే అంటున్న నజీర్‌ ఫీల్డ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. ఆ టోర్నీలో భారత్‌ చేతిలో 203 పరుగుల తేడాతో ఓడిన పాక్‌.. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ మహమ్మద్‌ హురేరా, హైదర్‌ అలీ, నజీర్‌, మునీర్‌ కీలకం కానుండగా.. పేసర్లు అబ్బాస్‌ అఫ్రీది, మహమ్మద్‌ అమీర్‌ ఖాన్‌, తాహిర్‌ హుస్సేన్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే సత్తా ఉంది.


2010 అండర్‌-19ప్రపంచకప్‌ తర్వాత మెగాటోర్నీలో పాక్‌ జట్టు భారత్‌పై విజయం సాధించలేదు.


అప్పుడలా..

2018 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్‌ 203 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. టాస్‌ నెగ్గిన అప్పటి కెప్టెన్‌ పృథ్వీషా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ మనోజ్‌ కల్రా (47)తో కలిసి షా (41) జట్టుకు చక్కటి ఆరంభాన్నిస్తే.. వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ (102 నాటౌట్‌) విశ్వరూపం ప్రదర్శించాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో యువ భారత్‌ 9 వికెట్లకు 272 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇషాన్‌ పొరెల్‌ (4/17) విజృంభించడంతో పాకిస్థాన్‌ 69 పరుగులకు ఆలౌటైంది. పొరెల్‌తో పాటు శివ సింగ్‌ (2/20), రియాన్‌ పరాగ్‌ (2/6) కూడా అదరగొట్టడంతో పాక్‌ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: ప్రియం గార్గ్‌ (కెప్టెన్‌), యశస్వి, దివ్యాన్ష్‌, తిలక్‌ వర్మ, ధృవ్‌ జురేల్‌, సిద్ధేశ్‌, అథర్వ, రవి, సుశాంత్‌, కార్తీక్‌, ఆకాశ్‌.

పాకిస్థాన్‌: రోహైల్‌ నజీర్‌ (కెప్టెన్‌), హైదర్‌ అలీ, హురేరా, ఫహద్‌, ఖాసిం, హరీస్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, అబ్బాస్‌ అఫ్రీది, తాహిర్‌, అమీర్‌ అలీ, అమీర్‌ ఖాన్‌.


పిచ్‌, వాతావరణం

పోచెఫ్‌స్ట్రూమ్‌లో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పడం కష్టం. మంగళవారం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్‌ రైద్దెతే.. గ్రూప్‌ స్టేజ్‌లో ఎక్కువ విజయాలు సాధించిన భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఆరంభంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించినా.. బంతి పాతబడ్డాక స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.


logo