శనివారం 16 జనవరి 2021
Sports - Dec 13, 2020 , 15:23:55

తేలిపోయిన భారత బౌలర్లు.. మెక్‌డెర్మట్‌, విల్డర్‌మత్‌ శతకాలు

తేలిపోయిన భారత బౌలర్లు.. మెక్‌డెర్మట్‌, విల్డర్‌మత్‌ శతకాలు

సిడ్నీ: ఆస్ట్రేలియా-ఏ, భారత్‌ మధ్య జరుగుతున్న రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది.  భారత్‌ నిర్దేశించిన 473 పరుగుల లక్ష్య ఛేదనలో 29 పరుగులకే  3  వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఆసీస్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌ మెక్‌ డర్మట్‌, జాక్‌ విల్డర్‌మత్‌ సెంచరీలతో  ఆదుకున్నారు. తన మొదటి ఆరు ఓవర్లలోనే సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీయగా..మహ్మద్‌ సిరాజ్‌ వేసిన తన తొలి ఓవర్‌లోనే వికెట్‌ పడగొట్టి కంగారూలకు షాకిచ్చారు. దీంతో టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెన్‌ మెక్‌డర్మట్‌ అద్భుత పోరాటం చేశాడు. మొదట అలెక్సీ కేరీ(58)తో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన బెన్‌.. తర్వాత జాక్‌ విల్డర్‌మత్‌తోనూ చక్కటి భాగస్వామ్యం   నెలకొల్పాడు.  వీరిద్దరూ నిలకడగా ఆడుతూ  లక్ష్యం దిశగా  సాగుతున్నారు.  

ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు.  ఒత్తిడిలోనూ డెర్మట్‌ గొప్పగా పోరాడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి సెషన్‌లో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన భారత బౌలర్లు డిన్నర్‌ విరామం తర్వాత పూర్తిగా తేలిపోయారు. బ్యాట్స్‌మెన్‌ అలవోకగా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అర్ధశతకం పూర్తైన తర్వాత విల్డర్‌మత్‌ టీ20 తరహాలో రెచ్చిపోయారు. ఆసీస్‌-ఏ విజయానికి ఇంకా 181  పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 73 ఓవర్లలో  4 వికెట్లకు 292 పరుగులు చేసింఇ. డెర్మట్‌(105), విల్డర్‌మత్‌(100) క్రీజులో ఉన్నారు.