శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Jul 25, 2020 , 00:49:58

తడబడి.. నిలబడి

తడబడి.. నిలబడి

  • మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 258/4
  • పోప్‌, బట్లర్‌ అజేయ అర్ధశతకాలు

మాంచెస్టర్‌: రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్‌ జట్టు.. నిర్ణయాత్మక మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగించింది. వెస్టిండీస్‌ బౌలర్లు విజృంభించడంతో ఆరంభంలో కాస్త తడబడ్డట్లే కనిపించిన ఆతిథ్య జట్టు.. ఆనక అదరగొట్టింది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఓ దశలో 122 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన  ఇంగ్లండ్‌ జట్టు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఒలీ పోప్‌ (91 బ్యాటింగ్‌; 11 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (56 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరొట్టడంతో మంచి స్కోరు చేయగలిగింది. భీకర ఫామ్‌లో ఉన్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (20), కెప్టెన్‌ జో రూట్‌ (17), సిబ్లే (0) త్వరగానే ఔటైనా.. బర్న్స్‌ (57)తో పాటు పోప్‌, బట్లర్‌ దుమ్ములేపారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. చేజ్‌కు ఒక వికెట్‌ దక్కింది. 

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 258/4 (పోప్‌ 91 బ్యాటింగ్‌, బట్లర్‌ 56 బ్యాటింగ్‌, బర్న్స్‌ 57; రోచ్‌ 2/56)