ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 15:45:00

టీమిండియా అగ్రశ్రేణి జట్టు.. ఎందుకో చెప్పిన ఇమ్రాన్‌ఖాన్‌

టీమిండియా అగ్రశ్రేణి జట్టు.. ఎందుకో చెప్పిన ఇమ్రాన్‌ఖాన్‌

కరాచీ : పాకిస్తాన్ ప్రధానమంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్.. టీమిండియాపై ప్రశసంల వర్షం కురిపించారు. భారత జట్టు ప్రపంచ శ్రేణి జట్లలో అగ్రశ్రేణి జట్టని కొనియాడారు. భారత్‌లో ప్రాథమిక క్రికెట్ మౌలిక సదుపాయాలను కావల్సినంతగా మెరుగుపరచడంతో భారతదేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. అయితే, పాకిస్తాన్ కూడా మంచి జట్టే అని, అయితే ఉత్పదకత లేని క్రికెట్‌ కారణంగా వెనకబడి పోతున్నదని చెప్పారు. 

చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ప్రదర్శనను వీక్షించిన ఇమ్రాన్‌ఖాన్‌ సోమవారం నాడు ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ భారతదేశాన్ని చూడండి. వారు ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా మారుతున్నారు. ఎందుకంటే వారు తమ క్రికెట్‌ నిర్మాణాన్ని మెరుగుపరుచుకున్నారు. అయినప్పటికీ, వారి కంటే మా దేశ క్రికెటర్లకే ఎక్కువ ప్రతిభ ఉన్నది. అయితే, ఉత్పాదకత ఇచ్చే నిర్మాణం జరిగినప్పుడే ఫలితం పొందుతాం" అని అన్నారు. భారత్‌లో క్రికెట్‌ ఆటకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నందునే వారు అగ్రశ్రేణి జట్టుగా మారుతున్నారన్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌లో క్రికెటర్లు చాలా ప్రతిభ కలిగి ఉన్నారని, అయితే ఉత్పాదకత లేని క్రికెట్ నిర్మాణం కారణంగా ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా అవతరించడం లేదని ఇమ్రాన్‌ఖాన్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రతిభను ప్రకాశవంతం చేయడానికి సమయం పడుతున్నదని, తమ దేశ జట్టు ప్రపంచ విజేతగా మారుతుందనే నమ్మకం తనకున్నదన్నారు. దేశంలో ఇప్పుడు ప్రావిన్షియల్ క్రికెట్ నిర్మాణంతో ఫలితాలు రెండు, మూడు సంవత్సరాలలో వస్తాయని ప్రధాని ఇమ్రాన్‌ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పోషకుడిగా, ఛైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌.. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆటకు ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నట్లు చెప్పారు. 

పాకిస్తాన్ జట్టు దాదాపు దశాబ్దం క్రితం వరకు అగ్రశ్రేణి జట్టుగా ఉండేది. కాని ప్రస్తుతం అత్యుత్తమ జట్టు మాదిరిగా ఉండకపోవడం పాకిస్తానీయులను కలవరపెడుతున్నది. ప్రపంచ కప్‌లో భారతదేశంపై పాకిస్తాన్‌ జట్టు ఇంతవరకు ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.

VIDEOS

logo