ఆదివారం 05 జూలై 2020
Sports - Jun 11, 2020 , 20:32:43

‘ఆటను ఆస్వాదిస్తున్నా.. ఇప్పట్లో వీడ్కోలు పలకను’

‘ఆటను ఆస్వాదిస్తున్నా.. ఇప్పట్లో వీడ్కోలు పలకను’

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనని భారత పురుషుల ఫుట్​బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ స్పష్టం చేశాడు. దాదాపు 15ఏండ్లుగా జాతీయ జట్టు తరఫున ఆడుతున్న తాను మరో నాలుగేండ్లయినా ఆడతానని భారత ఫుట్​బాల్ జట్టు ఫేస్​బుక్ పేజ్ లైవ్​లో గురువారం చెప్పాడు. ప్రస్తుతం తన ఫిట్​నెస్ యువ ఆటగాళ్లకు దీటుగా ఉందని 35ఏండ్ల ఛెత్రీ అన్నాడు.

“ఫుట్​బాల్​ను నేను ఆస్వాదిస్తున్నా. సమీప భవిష్యత్తులో నేను ఎక్కడికీ వెళ్లను. నేను చాలా ఫిట్​గా ఉన్నానని నా భార్యకు చెప్పా. ఉదాంత, ఆశికీ కురినియన్​(బెంగళూరు ఎఫ్​సీ ఆటగాళ్లు)తో పరుగు పందెం కూడా పెట్టుకుంటా అని చాలెంజ్​ కూడా చేశా. దాదాపు 15ఏండ్లకు పైగా దేశం తరఫున ఆడుతుండడం నా అదృష్టం. మరో 3-4 ఏండ్లు ఆడితే 20ఏండ్లు అవుతుంది. జాతీయ జట్టు తరఫున 20ఏండ్లు ఆడగలరని ఎవరు అనుకుంటారు. ప్రస్తుతం నేను కలలుగన్న జీవితంలో ఉన్నాను” అని ఛెత్రీ చెప్పాడు.

ఇప్పటి వరకు 115 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన ఛెత్రీ మొత్తం 72గోల్స్ చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉంటే.. ఛెత్రీ తర్వాత ప్లేస్​లో అర్జెంటీనా మ్యాస్ట్రో లియోనెల్ మెస్సీ ఉన్నాడు.  


logo