శనివారం 06 మార్చి 2021
Sports - Feb 11, 2021 , 13:31:49

మ‌త‌మే స‌మ‌స్య అయితే వాళ్లే న‌న్ను తొల‌గించేవాళ్లు: వ‌సీం జాఫ‌ర్‌

మ‌త‌మే స‌మ‌స్య అయితే వాళ్లే న‌న్ను తొల‌గించేవాళ్లు: వ‌సీం జాఫ‌ర్‌

ముంబై: ఉత్త‌రాఖండ్ క్రికెట్ టీమ్‌ కోచ్ ప‌ద‌వికి టీమిండియా మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ రాజీనామా చేయ‌డం వివాదం రేపుతోంది. టీమ్‌లో సెల‌క్ష‌న్ క‌మిటీ, క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ ఉత్త‌రాఖండ్ సెక్ర‌ట‌రీ మ‌హిమ్ వ‌ర్మ జోక్యం ఎక్కువవ‌డం వ‌ల్లే తాను రాజీనామా చేసిన‌ట్లు జాఫ‌ర్ చెబుతున్నాడు. అయితే ఈ ఆరోప‌ణ‌లు ఖండించిన అక్క‌డి క్రికెట్ అసోసియేష‌న్‌.. జాఫ‌ర్ టీమ్‌ను మ‌తం ఆధారంగా రెండుగా చీల్చాడ‌ని విమ‌ర్శించింది. ఇప్పుడు ఆ ఆరోప‌ణ‌ల‌పై జాఫ‌ర్ స్పందించాడు. ఒక‌వేళ మ‌త‌మే కార‌ణ‌మైతే.. వాళ్లు నన్ను తొల‌గిస్తారు కానీ.. నేను ఎందుకు రాజీనామా చేస్తాను అని అత‌డు ప్ర‌శ్నించాడు. 

చాలా బాధ క‌లుగుతోంది

తాను టీమ్ కోసం ఎంత‌గానో శ్ర‌మించాన‌ని, చివ‌రికి త‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం చాలా బాధ క‌లిగిస్తోంద‌ని జాఫ‌ర్ అన్నాడు. అర్హులైన ప్లేయ‌ర్స్‌ను తాను ప్రోత్స‌హించాల‌ని చూడ‌గా.. సెల‌క్ష‌న్ క‌మిటీ, అసోసియేషన్ సెక్ర‌ట‌రీ మాత్రం క‌నీసం త‌న అభిప్రాయం కూడా తీసుకోకుండా టీమ్‌ను ఎంపిక చేసేవారని ఆరోపించాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో కెప్టెన్ స‌హా మొత్తం 11 మంది ప్లేయ‌ర్స్ మారిపోయార‌ని, దీనిపై త‌న‌కు క‌నీస స‌మాచారం లేద‌ని జాఫ‌ర్ చెప్పాడు. త‌న మాట‌కు విలువ‌లేని చోట కోచ్‌గా కొన‌సాగ‌డం స‌రికాద‌ని భావించి రాజీనామా చేసిన‌ట్లు అత‌ను తెలిపాడు. గ‌తేడాది జూన్‌లో ఉత్త‌రాఖండ్ కోచ్‌గా జాఫ‌ర్ నియ‌మితుడ‌య్యాడు. 

మ‌తం ఆరోప‌ణ‌లు నిరాధారం

టీమ్‌ను మ‌తం ఆధారంగా చీల్చుతున్నాడ‌ని త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిరాధారమ‌ని జాఫ‌ర్ అన్నాడు. అదే నిజ‌మైతే వాళ్లే త‌న‌ను తొల‌గించేవాళ్లు క‌దా అని ప్ర‌శ్నించాడు. 15-20 ఏళ్ల పాటు నేను క్రికెట్ ఆడిన త‌ర్వాత ఈ ఆరోప‌ణ‌లు విన‌డం చాలా బాధ క‌లిగిస్తోంది. ఎంతో హుందాగా నేను క్రికెట్ ఆడాను అని జాఫ‌ర్ చెప్పాడు. 

VIDEOS

logo