మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 29, 2020 , 12:57:54

సగర్వంగా సెమీస్‌కు

సగర్వంగా సెమీస్‌కు

పొట్టి ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న భారత మహిళల జట్టు.. హ్యాట్రిక్‌ విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో తక్కువ పరుగులే చేసినా.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని అదుర్స్‌ అనిపించింది. రికార్డు స్ట్రయిక్‌రేట్‌తో విజృంభిస్తున్న యంగ్‌తరంగ్‌ షఫాలీ వర్మ కీలక పోరులో కసితీరా కొట్టడంతో భారీ స్కోరుకు బాటలు పడినా.. మిడిలార్డర్‌ మరోసారి పేలవ ప్రదర్శన కొనసాగించడంతో టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మెగాటోర్నీ ప్రారంభం నుంచి అంచనాలకు మించి రాణిస్తున్న బౌలర్లు మరోసారి సమిష్టిగా కదం తొక్కడంతో కివీస్‌పై ఒత్తిడి కొనసాగించిన హర్మన్‌ గ్యాంగ్‌.. తుదికంటా ఆధిపత్యం కనబరిచింది. ఆఖర్లో భారీ షాట్‌లతో విరుచుకుపడిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్‌ కాస్త భయపెట్టినా.. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి ఓవర్‌లో శిఖా పాండే తెలివైన బౌలింగ్‌తో టీమ్‌ఇండియాను విజయం వరించింది. ఈ విజయంతో సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌.. ఇక కప్పు కొట్టడమే తమ లక్ష్యమని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది.

  • హ్యాట్రిక్‌ విజయంతో నాకౌట్‌లో భారత్‌
  • ఉత్కంఠ పోరులో కివీస్‌పై పైచేయి.. మళ్లీ మెరిసిన షఫాలీ వర్మ

మెల్‌బోర్న్‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులకు బౌలర్ల స్ఫూర్తిదాయక ప్రదర్శన తోడవడంతో న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించిన హర్మన్‌ గ్యాంగ్‌ ఈ విజయంతో మెగాటోర్నీలో సెమీస్‌ చేరిన తొలిజట్టుగా నిలిచింది.  గ్రూప్‌-ఏలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ ఒక సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. ఈ గ్రూప్‌ నుంచి మరో స్థానం కోసం ఆస్ట్రేలియా (4 పాయింట్లు), న్యూజిలాండ్‌ (2 పాయింట్లు) పోటీపడుతున్నాయి. జంక్షన్‌ ఓవల్‌ మైదానంలో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత అమ్మాయిలు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేశారు. షఫాలీ వర్మ మరోసారి అదరగొట్టగా.. తానియా భాటియా (23; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. కెర్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌; 6 ఫోర్లు) టాప్‌స్కోరర్‌. భారత బౌలర్లలో దీప్తి, శిఖ, రాజేశ్వరి, పూనమ్‌, రాధ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ లో శనివారం శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది.


అబ్బాయిలతో ఆడటం వల్లే.. 

మహిళల ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు అభిమానుల కండ్లన్నీ స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మీద నిలిస్తే.. మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి యావత్‌ భారతంలో షఫాలీ గురించి చర్చ మొదలైంది. కండ్లు చెదిరే సిక్సర్లతో రెచ్చిపోతున్న ఈ 16 ఏండ్ల చిన్నది మహిళల టీ20ల్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌ (147.97) కలిగిన క్రికెటర్‌గా చరిత్రకెక్కింది. ఈ మెగాటోర్నీలో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో ఆమె 172.72 స్ట్రయిక్‌రేట్‌తో 114 పరుగులు చేయడం విశేషం. సచిన్‌ టెండూల్కర్‌ను దైవంలా భావించే షఫాలీ.. చిన్నతనంలో అబ్బాయిలతో కలిసి సాధన చేయడం వల్లే అలవోకగా భారీ షాట్లు కొట్టగలుగుతున్నానని పేర్కొంది. ‘నేను ఎక్కువగా అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడేదాన్ని. నాతో సాధన చేసిన అబ్బాయిలకు కృతజ్ఞతలు. వాళ్ల వల్లే బాగా శిక్షణ పొందా’ అని షఫాలీ తెలిపింది. మరోవైపు ఈ టీనేజ్‌ సంచలనం ఆటతీరుకు ముగ్ధుడైన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. షెఫాలీ ‘రాక్‌స్టార్‌' అంటూ కితాబిచ్చాడు. 


4మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి.స్కోరు బోర్డు

భారత్‌: షఫాలీ (సి) హేలీ జెన్సెన్‌ (బి) కెర్‌ 46, స్మృతి (బి) తహూహు 11, తానియా (సి) కెర్‌ (బి) మైర్‌ 23, జెమీమా (సి) కెర్‌ (బి) మైర్‌ 10, హర్మన్‌ప్రీత్‌ (సి అండ్‌ బి) కాస్ప్రెక్‌ 1, దీప్తి (సి) హేలీ జెన్సెన్‌ (బి) డివైన్‌ 8, వేద కృష్ణమూర్తి (ఎల్బీ) కెర్‌ 6, శిఖ (నాటౌట్‌) 10, రాధ (రనౌట్‌) 14, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 133/8. వికెట్ల పతనం: 1-17, 2-68, 3-80, 4-93, 5-95, 6-104, 7-111, 8-133, బౌలింగ్‌: తహూహు 2-0-14-1, మైర్‌ 3-0-27-2, డివైన్‌ 2-0-12-1, అన్నా పీటర్‌సన్‌ 2-0-19-0, హేలీ జెన్సెన్‌ 3-0-20-0, కెర్‌ 4-0-21-2, కాస్ప్రెక్‌ 4-0-19-1.


న్యూజిలాండ్‌: ప్రైస్ట్‌ (సి) రాధ (బి) శిఖ 12, డివైన్‌ (సి) రాధ (బి) పూనమ్‌ 14, సూజీ బేట్స్‌ (బి) దీప్తి 6, మ్యాడీ గ్రీన్‌ (సి) తానియా (బి) రాజేశ్వరి 24, కాటీ మార్టీన్‌ (సి) రోడ్రిగ్స్‌ (బి) రాధ 25, కెర్‌ (నాటౌట్‌) 34, హేలీ జెన్సెన్‌ (రనౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 130/6. వికెట్ల పతనం: 1-13, 2-30, 3-34, 4-77, 5-90, 6-130, బౌలింగ్‌: దీప్తి 4-0-27-1, శిఖ 4-0-21-1, రాజేశ్వరి 4-0-22-1, పూనమ్‌ 4-0-32-1, రాధ 4-0-25-1.


logo
>>>>>>