బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 17, 2020 , 00:20:16

సమరానికి కుర్రాళ్లు

సమరానికి కుర్రాళ్లు

విరాట్‌ కోహ్లీ, మహమ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌సింగ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, మనీశ్‌ పాండే, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించి టీమ్‌ఇండియాకు ఎంపికైన ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంటుంది. మెగాటోర్నీలో జోరు కనబర్చిన టీనేజర్‌లు భారత సీనియర్‌ జట్టు నుంచి పిలుపందుకోవడం పరిపాటి. ఆ జాబితాలో చేరేందుకు యువ ఆటగాళ్ల ముందు మరో చక్కటి అవకాశం నిలిచింది. నేటి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌నకు తెరలేవనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలో దిగుతున్న టీమ్‌ఇండియా మరోసారి టైటిల్‌ నిలబెట్టుకోవాలని భావిస్తుంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

  • -నేటి నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌
  • -డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో యువ భారత్‌
  • -మ్యాచ్‌లన్నీస్టార్‌స్పోర్ట్స్‌లోప్రత్యక్షప్రసారం

కేప్‌టౌన్‌: క్రికెట్‌ను మతంగా భావించే భారత అభిమానుల కోసం మరో మెగాటోర్నీ ముస్తాబైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండేండ్లకోసారి నిర్వహించే అండర్‌-19 ప్రపంచకప్‌నకు వేళైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలో దిగుతున్న భారత యువ జట్టు టైటిల్‌ నిలబెట్టుకోవాలని భావిస్తుంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో గ్రూపునకు నాలుగేసి చొప్పున మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. న్యూజిలాండ్‌, శ్రీలంక, జపాన్‌తో కలిసి భారత్‌ గ్రూప్‌-డిలో ఉంది. ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్‌ మధ్య జరిగే పోరుతో మెగాటోర్నీకి తెరలేవనుండగా.. భారత్‌ తొలి మ్యాచ్‌లో ఆదివారం శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.


విరాట్‌ కూడా ఇక్కడే.. 

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న విరాట్‌ కోహ్లీ కూడా గతంలో అండర్‌-19 స్థాయిలో మెరుపులు మెరిపించినవాడే. మలేషియా వేదికగా జరిగిన 2008 ప్రపంచకప్‌లో యువ భారత జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించాడు. మనీశ్‌ పాండే, రవీంద్ర జడేజా, సిద్ధార్థ్‌ కౌల్‌, అభినవ్‌ ముకుంద్‌, సౌరభ్‌ తివారి, శ్రీవత్స్‌ గోస్వామితో కూడిన ఆ జట్టులో విరాట్‌ వీరలెవల్లో విజృంభించాడు. వరుస విజయాలతో జట్టుకు రెండోసారి టైటిల్‌ అందించాడు. ఈ మెరుపులతో అనతి కాలంలోనే టీమ్‌ఇండియా పిలుపు అందుకున్న విరాట్‌ అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అంతకుముందు మహమ్మద్‌ కైఫ్‌ సారథ్యంలో యువ భారత్‌ తొలిసారి ట్రోఫీ ముద్దాడగా.. కోహ్లీ తర్వాత ఉన్ముక్త్‌ చంద్‌ (2012), పృథ్వీ షా (2018) కూడా భారత్‌ను విశ్వవిజేతగా నిలిపారు.


ఈసారి కూడా బలంగా.. 

యువ భారత జట్టు ఈసారి కూడా ఫేవరెట్‌గానే మెగాటోర్నీ బరిలో దిగనుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే మెరుపులు మెరిపిస్తున్న ఆటగాళ్లు ఉండటంతో మన జట్టు బలంగా కనిపిస్తున్నది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రియం గార్గ్‌ యువ భారత్‌ను నడిపించనున్నాడు. తెలంగాణ ఆటగాడు నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మతో పాటు యశస్వి జైస్వాల్‌, రవి బిష్ణోయ్‌, కార్తీక్‌ త్యాగి, ధృవ్‌ జురెల్‌ వంటి సత్తా ఉన్న ఆటగాళ్ల కలయికతో జట్టు పటిష్ఠంగా ఉంది. మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణలో రాటుదేలిన కుర్రాళ్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. 


వామప్‌లో అదుర్స్‌

కుర్రాళ్లలో సమిష్ఠితత్వం నింపేందుకు ఇప్పటికే మన జట్టు అనేక కార్యక్రమాలు చేపట్టగా.. పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందే దక్షిణఫ్రికాలో అడుగుపెట్టిన మనవాళ్లు అదరగొడుతున్నారు. అసలు పోరుకు ముందు ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను ఒడిసి పట్టిన ప్రియం గార్గ్‌ సేన.. ఆ తర్వాత క్వాడ్రాంగ్యులర్‌ ట్రోఫీని సైతం చేజిక్కించుకుంది. వామప్‌ మ్యాచ్‌ల్లోనూ మనవాళ్లు దూకుడు కనబరుస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్‌ ప్రియం గార్గ్‌, తిలక్‌ వర్మ, యశస్వి జైస్వాల్‌, ధృవ్‌ జురేల్‌ మంచి జోరు మీదుండటం మనకు కలిసొచ్చే అంశం. మరోవైపు జపాన్‌, నైజీరియా వంటి జట్లు కూడా మెగాటోర్నీలో సత్తాచాటేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆటవైపు ఆకర్షితమవుతున్న జపాన్‌ గ్రూప్‌-‘డి’లో మనతో పాటే బరిలో దిగనుండగా.. నైజీరియా గ్రూప్‌-‘బి’లో ఉంది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ హార్వే మేనల్లుడు మెకంజీ హార్వే ఆసీస్‌ యువ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్‌ జట్టులోనూ ప్రతిభగల ఆటగాళ్లకు కొదువలేదు.logo
>>>>>>