గురువారం 02 జూలై 2020
Sports - Jun 05, 2020 , 17:56:03

అలా ఆడ‌టం క‌న్నా.. ప్రపంచకప్ వాయిదా వేయండి

అలా ఆడ‌టం క‌న్నా..  ప్రపంచకప్ వాయిదా వేయండి

కరాచీ: ఖాళీ మైదానాల్లో టీ20 ప్రపంచకప్‌ జరగడాన్ని ఊహించుకోలేనని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. దానికంటే కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం తగ్గిన అనంతరం సరైన సమయం చూసి మెగాటోర్నీ నిర్వహించడం మేలని అభిప్రాయపడ్డాడు. ‘నా వరకైతే ఇది సరైన ఆలోచన కాదు. అభిమానులు లేకుండా ప్రపంచకప్‌ ఎలా నిర్వహిస్తారు. మెగాటోర్నీ అంటేనే భారీ జన సందోహం. తమ జట్లకు మద్దతు ఇచ్చేందుకు ప్రేక్షకులు తరలివస్తంపటారు. అదొక ప్రత్యేక అనుభూతి. ఖాళీ మైదానాల్లో అది సాధ్యపడదు. అందుకే ఐసీసీ కాస్త వేచి చూడాలి. కొవిడ్‌-19 తగ్గుముఖం పట్టాక.. పరిస్థితులు అదుపులోకి వచ్చాకే వరల్డ్‌కప్‌ నిర్వహించడం మేలు’ అని అక్రమ్‌ పేర్కొన్నాడు.

కరోనా నేపథ్యంలో ఐసీసీ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి క్రికెట్‌ ఆడటం కాస్త కష్టమే అని అక్రమ్‌ పేర్కొన్నాడు. ముఖ్యంగా బౌలర్లకు ఇది పూర్తి ప్రతిబంధకంగా మారే అవకాశముందని చెప్పాడు. ‘బంతి షైనింగ్‌ కోసం ఉమ్మి (సలైవా)ని ఉపయోగించకూడదని ఐసీసీ నిర్ణయించింది. ఇది బౌలర్లకు కష్టమైన పనే. సుదీర్ఘ ఫార్మాట్‌లో బంతి షైనింగ్‌పైనే మ్యాచ్‌ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఉమ్మికి బదులు చెమటను వినియోగించవచ్చని పేర్కొన్నా.. అది సరైన ప్రత్యామ్నాయం కాదు. అందుకే దాని స్థానంలో ఐసీసీనే ఇతర ఉపాయాలు ఆలోచించాలి’ అని అక్రమ్‌ అన్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌-నవంబర్‌లో పొట్టి ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో మెగాటోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు గత నెల 28న జరిగిన ఐసీసీ వీడియో కాన్ఫెరెన్స్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమగ్రంగా చర్చించిన అనంతరం ఈ నెల 10న పొట్టి ప్రపంచకప్‌ భవితవ్యం తేల్చనున్నట్లు ఐసీసీ పేర్కొంది.  


logo