శనివారం 06 జూన్ 2020
Sports - May 24, 2020 , 00:04:45

క్రికెట్‌ కొత్త కొత్తగా

క్రికెట్‌ కొత్త కొత్తగా

  • కరోనా వైరస్‌తో మార్పులు.. 
  • మార్గదర్శకాల్లో ఐసీసీ పలు సూచనలు

బౌలర్‌ బౌలింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో తన టోపీ, కండ్లద్దాలు, జంపర్‌ను అంపైర్‌ చేతిలో పెట్టి రనప్‌ మొదలుపెట్టడం మన మదిలో మెదిలే జ్ఞాపకం. మ్యాచ్‌లో రిజర్వ్‌ ఆటగాడు నీళ్ల సీసాలతో మైదానంలోకి రావడం, ఆటగాళ్లు గటగటా తాగడం ఎన్నోసార్లు చూసి ఉంటాం. ఒక ప్లేయర్‌ బ్యాట్‌ పాడైతే..మరొకరి బ్యాట్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించిన సందర్భాలు గుర్తుండే  ఉంటాయి. కానీ కొవిడ్‌-19తో క్రికెట్‌లో పెను మార్పులను త్వరలో చూడబోతున్నాం. వైరస్‌ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఐసీసీ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే వైరస్‌ ప్రభావం తర్వాత మన కిష్టమైన క్రికెట్‌ కొత్తగా దర్శనమివ్వబోతున్నది. 

దుబాయ్‌: ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులకు కారణమైన కరోనా వైరస్‌.. క్రీడాలోకాన్ని కూడా కుదిపేసింది. ప్రాణాంతక మహమ్మారి బారి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ క్రికెట్‌ను బతికించుకోవాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాన వైద్యాధికారిని నియమించుకోవడంతో పాటు 14 రోజుల పాటు ప్రి ఐసోలేషన్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీనికి తోడు కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ టెక్నికల్‌ కమిటీ బంతిపై మెరుపు కోసం ఉమ్మిని వాడవద్దంటూ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి అలవాట్లు మార్చుకోవడం సాధ్యం కాదని ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అంటుంటే.. ప్రత్యామ్నాయాలు వెతకాల్సిందే అని   క్రిస్‌ వోక్స్‌ అభిప్రాయపడుతున్నాడు.

ఎవరిది వారే..

బౌలర్లకు చెందిన జంపర్‌, కండ్లద్దాలు, హ్యాట్‌లను ఇకపై అంపైర్‌లు తమ వద్ద ఉంచుకోకూడదని ఐసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. వారి చేతులకు గ్లౌజులు తప్పనిసరి చేసింది. బ్రేక్‌ సమయంలో ఆటగాళ్లు ఎవరి బాటిల్‌ను వాళ్లు మాత్రమే తీసుకోవాలని.. ఎవరి టవల్‌తో వాళ్లే తుడుచుకోవాలని.. దీంతో పాటు క్రికెట్‌ సమాగ్రి విషయంలోనూ చాలా పక్కాగా ఉండాలని ఒకరి వస్తువులను మరొకరు వాడొద్దని ఆదేశాలిచ్చింది. ఇంత వరకు సరే అనుకుంటే.. డ్రెస్సింగ్‌ రూమ్‌లోని షవర్స్‌, చేంజింగ్‌ రూమ్స్‌లో ఎక్కువ సమయం ఉండకూడదని అవసరమైతే తప్ప ఎక్కువగా గుమిగూడకూడదని పేర్కొంది. ఆరోగ్యమే అన్నింటికన్నా ప్రధానం అని అంటున్న ఐసీసీ.. శానిటైజేషన్‌ను ఆటగాళ్ల జీవనంలో భాగం చేసుకోవాలని సూచించింది.

కనీసం రెండు నెలలైనా..

టెస్టు క్రికెట్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు బౌలర్లకు కనీసం రెండు, మూడు నెలల సమయం పట్టొచ్చని ఐసీసీ అంచనా వేస్తున్నది. పేస్‌ బౌలర్లు గాయాల బారిన పడకుండా ఉండాలంటే ప్రాక్టీస్‌ తప్పనిసరి అని పేర్కొంది. ‘సుదీర్ఘ ఫార్మాట్‌ బరిలో దిగాలంటే 8 నుంచి 12 వారాల శిక్షణ తప్పనిసరి, పూర్వస్థితిలో బౌలింగ్‌ చేసేందుకు పేసర్‌కు కనీసం నెల రోజుల గడువు కావాలి, అప్పుడే అతడు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పట్టుకోగలడు’అని ఐసీసీ పేర్కొంది. తొందరపడి సంప్రదాయ ఫార్మాట్‌ను ప్రారంభిస్తే.. గాయాల పాలయ్యే చాన్స్‌లు ఎక్కువ అని హితవు పలికింది.logo