శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 07, 2020 , 21:34:18

బ్యాట్‌కు బాల్‌కు బ్యాలెన్స్‌ తప్పినట్లే: జాఫర్‌

బ్యాట్‌కు బాల్‌కు బ్యాలెన్స్‌ తప్పినట్లే: జాఫర్‌

ముంబై: టెస్టు క్రికెట్‌లో బంతిపై ఉమ్మి (సలైవా) వాడకం లేకపోతే బాల్‌కు బ్యాట్‌కు మధ్య ఆసక్తికర పోరు కనిపించదని భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ పేర్కొన్నాడు. ఈ నిర్ణయం బౌలర్లను మరింత కష్టాల్లోకి నెడుతుందని వ్యాఖ్యానించాడు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసింది. ఇందులో ఉమ్మి, చెమటపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో జాఫర్‌ మాట్లాడుతూ..

‘ఐసీసీ నిర్ణయం బౌలర్లకు శరాఘాతమే. బంతిపై ఉమ్మి వాడకాన్ని నిషేధిస్తే.. బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోవడం ఖాయమే. ఆట అన్నాక బంతికి, బ్యాట్‌కు మధ్య బ్యాలన్స్‌ ఉండాలి. ఆ రెండింటి మధ్య ఆసక్తికర సమరాలు ఇక చూడలేమేమో. వన్డేల్లోలాగా సంప్రదాయ క్రికెట్‌లోనూ రెండు కొత్త బంతుల విధానాన్ని ప్రవేశపెడితే కొంతలో కొంత మెరుగ్గా ఉంటుందని నా సలహా. బాక్సింగ్‌, రెజ్లింగ్‌తో పోల్చుకుంటే క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య దూరం కాస్త ఎక్కువగా ఉన్నా.. డ్రెస్సింగ్‌ రూమ్‌, డగౌట్‌ విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కరోనా వైరస్‌ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో ఊహించడం కూడా కష్టంగా ఉంది’ అని అన్నాడు.  


logo