శనివారం 11 జూలై 2020
Sports - Jun 11, 2020 , 01:55:34

అదే సందిగ్ధత టీ20 ప్రపంచకప్‌పై రాని స్పష్టత l

అదే సందిగ్ధత టీ20 ప్రపంచకప్‌పై రాని స్పష్టత l

వచ్చే నెలలో ఐసీసీ నిర్ణయం

న్యూఢిల్లీ: పొట్టి ప్రపంచకప్‌ నిర్వహణపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరోసారి వాయిదా పాట అందుకుంది. బుధవారం మూడు గంటలకుపైగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. పొట్టి ప్రపంచకప్‌ వాయిదా పడితే.. ఆ స్లాట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిర్వహించాలని భావించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. దీంతో పాటు ఐసీసీ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని ఊహిస్తే.. ఈ అంశంపై కూడా ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

చర్చించాకే నిర్ణయం

టీ20 ప్రపంచకప్‌తో పాటు 2021లో జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్‌కప్‌ల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని ఐసీసీ పేర్కొంది. కొవిడ్‌-19తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడబోమని వెల్లడించింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. ఆటగాళ్లతో పాటు ఆటకు సంబంధం ఉన్న వారందరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఒకేసారి ఉంటుంది. కాబట్టి సభ్యులు, ప్రసారకర్తలు, ప్రభుత్వాలు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఇలా అందరితో చర్చించిన తర్వాతే దానిని ప్రకటిస్తాం’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మనూ సాహ్ని బుధవారం స్పష్టం చేశారు.

డిసెంబర్‌ వరకు గడువు

మెగాటోర్నీలకు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బీసీసీఐకి గడువు లభించింది. ఐసీసీ టోర్నీల నిర్వహణ విషయంలో గత కొన్నాళ్లుగా బీసీసీఐ, ఐసీసీ మధ్య ఈ-మెయిల్‌ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజా సమావేశంలో దీనిపై చర్చించిన అనంతరం సమస్యల పరిష్కారం కోసం బీసీసీఐకి ఈ ఏడాది డిసెంబర్‌ వరకు గడువు ఇస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 


logo