గురువారం 02 జూలై 2020
Sports - May 29, 2020 , 00:32:57

జూన్‌ 10 తర్వాతే..

 జూన్‌ 10 తర్వాతే..

  • టీ20 ప్రపంచకప్‌ సహా పలు నిర్ణయాలు వాయిదా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి    (ఐసీసీ) మూడు రోజుల బోర్డు టెలీ కాన్ఫరెన్స్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకుండానే ముగిశాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై స్పష్టమైన సంకేతాలు ఇస్తుందనుకుంటే.. నిర్ణయాన్ని వచ్చే నెల 10కి వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ గురువారం ప్రకటించింది. దీంతో మెగాటోర్నీ నిర్వహణపై సందిగ్ధత మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. అసలు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం పొట్టి ప్రపంచకప్‌ జరుగుతుందా..లేక వచ్చే ఏడాదికి వాయిదానా లేక 2022లో జరుగుతుందా అన్నదానిపై ఐసీసీ స్పష్టత ఇవ్వలేకపోయింది. దీనికి  తోడు కరోనా వైరస్‌ ప్రభావం తర్వాత క్రికెట్‌ పునరుద్ధరణ, క్రికెట్‌ కమిటీ సూచించిన ఉమ్మిపై నిషేధం, భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక(ఎఫ్‌టీపీ), చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ వంటి అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుంటూ టీ20 ప్రపంచకప్‌ నిర్వహణకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ప్రకటించిన భారత పర్యటన షెడ్యూల్‌ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నది. భారత్‌తో అక్టోబర్‌లో టీ20 సిరీస్‌ నిర్వహించేందుకు సిద్ధమైనప్పుడు అదే సమయంలో ప్రపంచకప్‌నకు వచ్చిన సమస్య ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చ మొదలైంది. మరోవైపు సమావేశాల్లో చర్చకు వస్తున్న అంశాలు బయటకు పొక్కడంపై ఐసీసీ ఎథిక్స్‌ అధికారి నేతృత్వంలో తక్షణమే స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించాలని ఐసీసీ నిర్ణయించింది.


logo