సోమవారం 06 జూలై 2020
Sports - Jun 19, 2020 , 16:21:49

యూఎస్ ఓపెన్​పై జకోవిచ్ ‘యూటర్న్​’

యూఎస్ ఓపెన్​పై జకోవిచ్ ‘యూటర్న్​’

పారిస్​: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్​స్లామ్ టోర్నీపై సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్​ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ మనసు మార్చుకున్నాడు. న్యూయార్క్​లో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో టోర్నీ నిర్వహించడం కష్టమేనని, ఒకవేళ జరిపినా ఎవరూ పాల్గొనే పరిస్థితులు లేవని ఇటీవల చెప్పాడు. అయితే శుక్రవారం తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూఎస్ ఓపెన్ టోర్నీ జరిగితే చాలా మంచిదని, తాను సంతోషిస్తానని అన్నాడు.

“గ్రాండ్​స్లామ్ టోర్నీలతో సహా అన్ని టోర్నీలు జరిగితే నాకు చాలా సంతోషం, ఉత్సాహంగా ఉంటుంది. అమెరికాలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో యూఎస్​ ఓపెన్​పై సందిగ్ధత ఏర్పడింది. నాతో పాటు చాలా మంది టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే యూఎస్ ఓపెన్ జరిగితే సంతోషిస్తా. ఎందుకంటే ఎంతో మందికి అవకాశాలు, చాలా మందికి ఉపాధి దక్కుతుంది.. ఆటగాళ్లకు పోటీ పడేందుకు అవకాశం వస్తుంది. ఆటను, ప్రయాణాలను మిస్సవుతున్నాం. మొత్తంగా యూఎస్ ఓపెన్​పై సానుకూల సమాచారమే వస్తుందని ఆశిస్తున్నా. ఒకవేళ టోర్నీ జరిగేతే పాల్గొంటానా లేదా అన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను’ అని జకోవిచ్ చెప్పాడు. కాగా ప్రేక్షకులు లేకుండా అయినా సరే యూఎస్ ఓపెన్​ను నిర్వహించాలని భావిస్తున్నట్టు అమెరికా టెన్నిస్​ సంఘం ప్రకటించిన నేపథ్యంలో జకో తన అభిప్రాయాలన్ని మార్చుకున్నాడు. షెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభం కావాల్సి ఉంది. 


logo