శనివారం 24 అక్టోబర్ 2020
Sports - Jul 11, 2020 , 18:32:09

నేను తిరిగి వన్డే ఫార్మాట్లో జాతీయ జట్టులోకి వస్తా : రహానె

నేను తిరిగి వన్డే ఫార్మాట్లో జాతీయ జట్టులోకి వస్తా : రహానె

తాను వన్డే ఫార్మాట్‌లో తిరిగి జాతీయ జట్టులోకి వస్తాననే నమ్మకం ఉందని టీమిండియా ఆటగాడు అజింక్య రహానే అన్నాడు. రహానే చివరగా వన్డేల్లో ఫిబ్రవరి 2018 లో ఆడాడు. మూడు ఫార్మాట్లలో ఆడటానికి తనను తాను సిద్ధం  చేసుకుంటున్నట్లు ఈ 32 ఏండ్ల బ్యాట్స్‌మెన్‌ తెలిపాడు. 

మాజీ వికెట్ కీపర్ డీప్ దాస్‌గుప్తాతో ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో జరిగిన సంభాషణలో రహానె మాట్లాడుతూ ఓపెనన్‌ లేదా నాలుగో స్థానంలోనైనా తాను వన్డే మ్యాచుల్లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. వన్డే క్రికెట్‌కు తిరిగి రావాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. అయితే తనకు ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదన్నాడు. 

వన్డేల్లో ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనుకుంటున్నారు అని రహానెను అడిగినప్పుడు ‘‘నేను ఇన్నింగ్స్‌ను ప్రారంభించడాన్ని ఆనందిస్తాను, కానీ నాలుగో స్థానంలో కూడా సౌకర్యంగా బ్యాటింగ్‌ చేయగలుగుతాను. కొంతకాలం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తరువాత, మళ్లీ ఓపెనర్‌గా ఆడటం చాలా కష్టం అయితే నేను రెండింటిలోనూ న్యాయం చేయగలననే నమ్మకం ఉంద’’ని రహానె అన్నాడు.

ఇప్పటివరకు 90 వన్డేలు ఆడి ౩ సెంచరీలు చేసిన రహానె, 65 టెస్టులు ఆడి 11 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. అయితే ప్రస్తుతం జట్టులో గట్టి పోటీ ఉన్నందున రహానె తిరిగి రావడం అంత సులభం కాదు. రహానె నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయగలడు కానీ ముంబై బ్యాట్స్ మెన్‌ శ్రేయాస్ అయ్యర్ ఈ స్థానంలో ఇప్పుటికే కూరుకుపోయాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఇప్పటికే జట్టులో ఓపెనర్లుగా రాణిస్తున్నారు.


logo