గురువారం 09 జూలై 2020
Sports - May 05, 2020 , 17:54:20

2020ను కోల్పోయినట్టే: నాదల్​

2020ను కోల్పోయినట్టే: నాదల్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది టెన్నిస్ పోటీలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదని ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ చెప్పాడు. వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన ఆస్ట్రేలియన్ ఓపెనే తదుపరి టెన్నిస్ టోర్నీ అయ్యే అవకాశముందని చెప్పాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం టెన్నిస్ పోటీలన్నీ నిలిచిపోగా..  పునఃప్రారంభంపై తన అభిప్రాయాలను మంగళవారం స్పానిష్​ పత్రిక ఐఈ పారిస్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదల్ వెల్లడించాడు.

“ఈ ఏడాది టెన్నిస్ పోటీలు మళ్లీ ప్రారంభం కావాలని నేను ఆశిస్తున్నా. కానీ అది సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. మొత్తంగా 2020ని మనం కోల్పోయినట్టే. వచ్చే ఏడాది కోసం సిద్ధమవుతున్నా. వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన ఆస్ట్రేలియా ఓపెన్​తో మళ్లీ టెన్నిస్ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నా” అని నాదల్ చెప్పాడు. కరోనా వైరస్ కారణంగా వింబుల్డన్ గ్రాండ్​స్లామ్ టోర్నీ రద్దు కాగా, ఆగస్టులో ప్రారంభం కావాల్సిన  యూఎస్ ఓపెన్ నిర్వహణ తీవ్ర సందిగ్ధంగా మారింది. ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్​కు వాయిదా పడింది.  


logo