సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 00:19:47

కారణలేంటో తెలియవు..

కారణలేంటో తెలియవు..

  • జీవితకాల నిషేధంపై అజారుద్దీన్‌
  • ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి బయపడటం సంతృప్తి
  • పాకిస్థాన్‌ వెబ్‌సైట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ 

కరాచీ: తనపై జీవితకాల నిషేధం విధించడానికి కారణమేంటో ఇప్పటికీ తెలియదని భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో 2000 డిసెంబర్‌లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అజ్జూభాయ్‌పై లైఫ్‌ టైమ్‌ బ్యాన్‌ విధించింది. ఈ అంశంపై న్యాయ పోరాటం చేసిన అజారుద్దీన్‌ ఇటీవలే ఆ ఆరోపణల నుంచి బయటపడి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల తర్వాత తిరిగి బీసీసీఐ ఏజీఎంలో అడుగుపెట్టడం.. ఈడెన్‌ గార్డెన్స్‌లో గంట మోగించడం చాలా సంతృప్తినిచ్చాయని అజ్జూభాయ్‌ చెప్పాడు. బుధవారం క్రికెట్‌ పాకిస్థాన్‌ వెబ్‌సైట్‌తో అజారుద్దీన్‌ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే..

పుష్కర కాలం తర్వాత..

12 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి బయటపడ్డా. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. బీసీసీఐ వార్షిక సమావేశంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆనందించా. నేను విధిని నమ్ముతా. రాసిపెట్టి ఉంటే దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. 

ఇంకేం కావాలి..

కెరీర్‌లో 99 టెస్టులు ఆడాను. మరో మ్యాచ్‌ ఆడితే సెంచరీ పూర్తయ్యేది. ఆ ఒక్కటి ఆడనందుకు ఎలాంటి అసంతృప్తి లేదు. 16 ఏండ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించా.. అందులో దాదాపు పదేండ్లు కెప్టెన్‌గా వ్యవహరించా. మూడు ప్రపంచకప్‌లలో కెప్టెన్‌గా జట్టును నడిపించా. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి.

జహీర్‌ అబ్బాస్‌ సలహాలతో..

1989 పాకిస్థాన్‌ పర్యటన సమయంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డా. ఆ సమయంలో మేము కరాచీలో ప్రాక్టీస్‌ చేస్తుంటే జహీర్‌ అబ్బాస్‌ భాయ్‌ అక్కడికి వచ్చాడు. నీకు ఏమైంది ఎందుకు త్వరగా ఔటవుతున్నావు అని ప్రశ్నించాడు. నేను నా ఇబ్బందిని ఆయన ముందుంచా. దీంతో చిన్నపాటి సూచనలు చేశారు. గ్రిప్‌ మార్చమని ఆయన ఇచ్చిన సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది. అక్కడి నుంచి మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 2016 ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా యూనిస్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే అతడికి కొన్ని సలహాలు ఇచ్చా.. వాటిని అతడు స్వీకరించడం ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత అతడు ఓవల్‌ టెస్టులో ద్విశతకంతో చెలరేగాడు. 

ఫీల్డింగ్‌ను ఆస్వాదిస్తా..

పాత రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు ఫీల్డింగ్‌ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ నాకు ఫీల్డింగ్‌ అంటే ప్రాణం. ఒక మంచి క్యాచ్‌ పట్టినప్పుడు బ్యాటింగ్‌, బౌలింగ్‌కన్నా ఫీల్డింగ్‌నే ఎక్కువ ఆస్వాదిస్తాం.


logo