బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:23:16

గవాస్కర్‌పై అనుష్క ఆగ్రహం

గవాస్కర్‌పై అనుష్క ఆగ్రహం

దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గురువారం పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ విఫలం కావడంతో ఆ సమయంలో కామెంట్రీలో ఉన్న గవాస్కర్‌.. విరుష్క జోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని అనుష్క డిమాండ్‌ చేసింది. ‘మీరు చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరమైనవి. దానిపై వివరణ వినాలనుకుంటున్నా. పంజాబ్‌తో మ్యాచ్‌లో నా భర్త ఆటతీరును విమర్శించడానికి మీ దగ్గర ఎన్నో మాటలు ఉండి ఉంటాయి. కానీ నా గురించి ప్రస్తావించడం దేనికి. క్రికెట్‌లోకి నన్ను లాగడం ఎప్పుడు ఆపేస్తారు?’ అని అనుష్క ఇన్‌స్టాలో పేర్కొంది. సన్నీ వంటి దిగ్గజ ఆటగాడు ద్వందార్థంలో వ్యాఖ్యలు చేయడంపై విరుష్క అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఫైర్‌ అవుతున్నారు. 

ఇబ్బందికర వ్యాఖ్యలు చేయలేదు: గవాస్కర్‌

ఈ అంశంపై స్పందించిన గవాస్కర్‌.. అనుష్కపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేయలేదని అన్నాడు. ‘లాక్‌డౌన్‌లో ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ చేసే సమయం దొరకలేదని సహచర వ్యాఖ్యాతతో చెప్పా. మొదటి మ్యాచ్‌లో రోహిత్‌, ధోనీ,విరాట్‌ గొప్పగా బ్యాటింగ్‌ చేయలేదు. కోహ్లీకి సరైన ప్రాక్టీస్‌ లేదనేది నా ఉద్దేశం. అనుష్క బౌలింగ్‌లో మాత్రమే కోహ్లీ ప్రాక్టీస్‌ చేశాడని అన్నా. వారిద్దరూ టెన్నిస్‌ బంతితో ఆడిన వీడియో గురించి మాట్లాడా. బౌలింగ్‌ అనే పదమే ఉపయోగించా. నా వ్యాఖ్యల్లో వేరే అర్థం తీసుకుంటే ఏం చేయాలి?’ అని గవాస్కర్‌ వాపోయాడు. 


logo