శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 14, 2020 , 21:31:43

కోహ్లీకి మంచి భవిష్యత్ ఉంటుందని అప్పుడే ఊహించా : భ‌జ్జీ

కోహ్లీకి మంచి భవిష్యత్ ఉంటుందని అప్పుడే ఊహించా : భ‌జ్జీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ‌లో అస్సలు భయం కనిపించదని.. 2008లో కోహ్లి ఆట‌ను చూసి మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఊహించాన‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్‌కు దూర‌మైన భ‌జ్జీ కుటుంబ స‌భ్యుల‌తో ఇండియాలో ఉన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్ షోలో హ‌ర్భ‌జ‌న్ మాట్లాడుతుండగా.. విరాట్ గురించి చ‌ర్చ వ‌చ్చింది. అప్పుడు భ‌జ్జీ స్పందిస్తూ ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా విరాట్ కోహ్లీలో బెరుకు కనిపించద‌న్నాడు. ఇప్పుడే కాదు.. ఐపీఎల్‌లో ఆడిన తొలి సీజన్‌లోనూ ఈ బెంగళూరు కెప్టెన్ సాహసోపేతంగా బ్యాటింగ్ చేసినట్లు హర్భజన్ గుర్తు చేసుకున్నాడు.

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి బెంగళూరు తరఫునే కోహ్లీ మ్యాచ్‌లు ఆడుతుండగా.. పదేళ్లపాటు ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఆడిన భ‌జ్జీ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మారిన విషయం తెలిసిందే. ‘‘ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో బెంగళూరు, ముంబై మధ్య మ్యాచ్ ఉండ‌గా.. కెప్టెన్ సచిన్ దూర‌మ‌వ‌డంతో ముంబై కెప్టెన్‌గా నేను వ్యవహరించాను. మ్యాచ్‌లో శ్రీలంక దిగ్గజం స‌నత్ జయసూర్య వేసిన బంతికి విరాట్ కోహ్లీ క్రీజు వెలుపలికి వచ్చి మరీ సిక్స్ కొట్టాడు. ఆ టైమ్‌లో కోహ్లిలో ఏ మాత్రం బెరుకు క‌నిపించ‌లేదు. కోహ్లీకి మంచి భవిష్యత్ ఉంటుందని అప్పుడే ఊహించా’’ అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo