గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 02:55:20

హామిల్టన్‌ రికార్డు

హామిల్టన్‌ రికార్డు

నుర్‌బర్గ్‌: బ్రిటన్‌ స్టార్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ చరిత్ర సృష్టించాడు. ఈఫిల్‌ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలువడం ద్వారా.. ఫార్ములా వన్‌ ఆల్‌టైం గ్రేట్‌ మైకెల్‌ షూమాకర్‌ సరసన నిలిచాడు. 91 టైటిల్స్‌తో షూమాకర్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజా గెలుపుతో హామిల్టన్‌ ఆ సంఖ్యను సమం చేశాడు. తన తండ్రి సాధించిన ఘనతను సమం చేయడంతో.. గతంలో షూమాకర్‌ ధరించిన హెల్మెట్‌ను అతడి కుమారుడు మిక్‌.. లూయిస్‌కు బహుమతిగా ఇచ్చాడు. 2013లో స్కైయింగ్‌ చేస్తూ.. షూమాకర్‌ తీవ్రంగా గాయపడటంతో అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో పాటు షూమాకర్‌ పేరిట ఉన్న ఏడు ప్రపంచ టైటిల్స్‌ ఘనతకు కూడా హామిల్టన్‌ చేరువయ్యాడు. ఈ ఏడాది డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో మెర్సెడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ 69 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆదివారం జరిగిన రేసును పోల్‌ పొజిషన్‌ నుంచి ప్రారంభించిన లూయిస్‌ అందరికంటే ముందు లక్ష్యాన్ని చేరగా.. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెస్టాపెన్‌, డానియల్‌ రికియార్డో (రెనాల్ట్‌) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. రెనాల్ట్‌కు చెందిన డ్రైవర్‌ పోడియం ఫినిష్‌ చేయడం 2011 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మెర్సెడెస్‌కే చెందిన మరో డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ సాంకేతిక లోపం కారణంగా రేసును పూర్తి చేయలేకపోయాడు.