సోమవారం 23 నవంబర్ 2020
Sports - Nov 21, 2020 , 16:08:47

నా గాయం చిన్న‌దే.. బీసీసీఐకి ముందే చెప్పాను!

నా గాయం చిన్న‌దే.. బీసీసీఐకి ముందే చెప్పాను!

ముంబై: త‌న గాయం చుట్టూ ముసురుకున్న వివాదానికి టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఫుల్‌స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. తొలిసారి త‌న‌కైన తొడ కండ‌రాల గాయంపై రోహిత్ స్పందించాడు. పీటీఐకి ఇచ్చిన సుదీర్ఘ ఇంట‌ర్వ్యూలో రోహిత్ త‌న గాయం, ఆస్ట్రేలియా టూర్‌, ఎన్సీయేలో ఫిట్‌నెస్ క‌స‌ర‌త్తులు‌, ముంబై ఇండియ‌న్స్ టీమ్ గురించి త‌న ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. త‌న గాయం చుట్టూ ఎందుకింత రాద్ధాంతం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేద‌ని అత‌నన్నాడు. అస‌లు ఏం జ‌రుగుతోందో, ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావ‌డం లేదు. నా గాయం గురించి నేను ఎప్ప‌టిక‌ప్పుడు బీసీసీఐ, ముంబై ఇండియ‌న్స్‌కు స‌మాచారం ఇచ్చాన‌ని రోహిత్ చెప్పాడు. త‌న గాయం చిన్న‌దేన‌ని కూడా స్ప‌ష్టం చేశాడు. 

ఢిల్లీతో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్లో రోహిత్ 68 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అప్ప‌టికీ త‌న‌ను గాయం వేధిస్తోంద‌ని అత‌డు చెప్పాడు.  ప్ర‌స్తుతం అత‌ను నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్సీయే)లో త‌న ఫిట్‌నెస్‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. టీ20 ఫార్మాటే కావ‌డంతో తాను ఆడ‌తాన‌ని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పాన‌ని అత‌ను వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం తాను గాయం నుంచి కోలుకున్నాన‌ని కూడా చెప్పాడు. అయితే త‌న గాయంపై ఇంకాస్త దృష్టి సారించాల్సి ఉంద‌ని, అందులోనూ ఆస్ట్రేలియాలో 11 రోజుల వ్య‌వ‌ధిలో 6 ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్‌లు ఉండ‌టం వ‌ల్లే తాను వ‌న్డే, టీ20 సిరీస్‌కు అందుబాటులో లేన‌ని చెప్పాడు. టెస్ట్ సిరీస్ క‌ల్లా పూర్తిగా కోలుకుంటాన‌ని అత‌న‌న్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డానికి ప్ర‌స్తుతం రోహిత్‌కు మూడున్న‌ర వారాల స‌మ‌యం ఉంది. డిసెంబ‌ర్ 17న అడిలైడ్‌లో తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే.