శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 19, 2020 , 01:17:44

సూపర్‌ మామ్‌!

సూపర్‌ మామ్‌!

ఏడాదిన్నర చిన్నారిని ప్రేక్షకుల్లో కూర్చోబెట్టి బరిలో దిగడం కొత్తగా అనిపిస్తున్నది. పునరాగమనం చేయడంలో కుటుంబసభ్యులతో పాటు కోచింగ్‌ స్టాఫ్‌ కృషి ఎంతో ఉంది. ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ఉత్సాహంతో మెల్‌బోర్న్‌ బరిలో దిగుతా.. రాకెట్‌ పట్టాక రెండేండ్ల విరామం తీసుకున్నాననే విషయం మర్చిపోయా.. నా పాత శైలినే కొనసాగించా. - సానియా మీర్జా

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : చైనా ఓపెన్‌ (2017, అక్టోబర్‌)లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సానియా మోకాలి గాయంతో మైదానానికి దూరమైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తాను బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించడంతో.. ఇక సానియా టెన్నిస్‌ కోర్టుకు దూరమైనట్లే అనే వార్తలు వినిపించాయి. 2018 అక్టోబర్‌లో పండంటి బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె శరీరంలో వచ్చిన మార్పులు.. వాటికి మరింత ఊతాన్నిచ్చాయి. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌లా తాను తిరిగి రాకెట్‌ పడుతానని సానియా అడపాదడపా చెప్తూ వచ్చినా.. దాన్ని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ప్రతిసారి లాగే విమర్శకులకు తన రాకెట్‌తోనే సమాధానమిచ్చి సానియా సూపర్‌ మామ్‌ అనిపించుకుంది.

అదే జోరు..

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ జరుగనున్న ఈ ఏడాది రాకెట్‌ పట్టిన 33 ఏండ్ల సానియా.. రీ ఎంట్రీ అంటే ఇది అనే రీతిలో రెచ్చిపోయింది. తల్లయ్యాక తన శరీరాకృతిని తిరిగి మార్చుకునేందుకు ఆరునెలలు చెమటోడ్చిన ఈ హైదరాబాదీ.. 26 కేజీల బరువు తగ్గి పునరాగమనం చేసిందంటే ఆటపై ఆమెకున్న మక్కువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హోబర్ట్‌లో ఆమె కదలికలు గమనించిన వారెవరైనా.. ఆమె రెండేండ్లు ఆటకు దూరమైందంటే నమ్మడం కష్టమే. తనకు అలవాటైన రీతిలో బ్యాక్‌హ్యాండ్‌ స్ట్రోక్స్‌తో పాటు.. నెట్‌కు సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన బంతులను పాయింట్లుగా మలుచుకున్న తీరు చూస్తే.. పాత సానియా గుర్తుకురాక మానదు.
SaniaMirza1

ఒలింపిక్స్‌ లక్ష్యంగా..

ఇప్పటివరకు మూడుసార్లు ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన సానియా మీర్జా ఒక్కసారి కూడా పతకం నెగ్గలేకపోయింది. తన కెరీర్‌లో మిగిలిపోయిన ఈ లోటు తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న ఆమె.. టోక్యోలో సత్తాచాటాలని భావిస్తున్నది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్‌ పైనే తన దృష్టి అంటున్న సానియా.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


logo