బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 27, 2020 , 03:01:50

700 వికెట్ల మార్క్‌ చేరగలను: అండర్సన్‌

700 వికెట్ల మార్క్‌ చేరగలను: అండర్సన్‌

లండన్‌:  టెస్టు చరిత్రలో 600వికెట్లు తీసిన తొలి పేసర్‌గా చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ మరో మైలురాయిపై కన్నేశాడు. తనలో ఆట ఇంకా చాలా మిగిలి ఉందని, 700వికెట్ల మార్కు అధిగమించగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌తో మూడో టెస్టులో మంగళవారం అజర్‌ అలీ వికెట్‌ తీయడం ద్వారా 600వికెట్ల మార్కును చేరి టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా జేమ్స్‌ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. కాగా తాను మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగుతానన్న నమ్మకం ఉందని అండర్సన్‌ బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. మ్యాచ్‌ల్లోనూ రాణిస్తున్నా. జట్టుకు సేవలు అందించే సత్తా ఇంకా నాలో ఉంది. నేను ఎంత కాలం అలా భావిస్తానో అప్పటి వరకు కొనసాగుతా. 700వికెట్ల మార్కును చేరుకోగలను. టెస్టు జట్టులో కొనసాగేందుకు నేను నిత్యం శ్రమిస్తూ నిరూపించుకుంటూనే ఉంటా’ అని అండర్సన్‌ చెప్పాడు.  అండర్సన్‌కు అనిల్‌ కుంబ్లే, టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. 

 మళ్లీ టాప్‌-10లోకి.. 

 పాకిస్థాన్‌తో మూడో టెస్టులో ఏడు వికెట్లతో సత్తాచాటిన అండర్సన్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌-10లోకి వచ్చాడు. బుధవారం తాజా ర్యాంకింగ్స్‌ వెల్లడవగా.. జేమ్స్‌ ఆరు ర్యాంక్‌లు ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరాడు. ఆస్ట్రేలియా పేసర్‌ కమిన్స్‌ టాప్‌ ర్యాంక్‌ ఉన్నాడు. 


logo