శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 13, 2020 , 03:05:15

తొందరేం లేదు ఐసీసీ చైర్మన్‌ పదవిపై గంగూలీ..

తొందరేం లేదు ఐసీసీ చైర్మన్‌ పదవిపై గంగూలీ..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ అయ్యేందుకు తొందరేం లేదని, తన వయసు ఇంకా తక్కువేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ బాస్‌ స్థానం నుంచి తప్పుకొన్నాక గంగూలీనే ఆ పీటంపై కూర్చోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై గంగూలీ ఆదివారం స్పందించాడు. ‘ఐసీసీలో పరిస్థితి మారింది. ఒకవేళ ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా ఉంటే ప్రస్తుతం బోర్డులో ఉన్న పదవిని వదిలేయాలి. ఇది బీసీసీఐ చేసిన మార్పు కాదు.. ఐసీసీ తెచ్చిందే. బీసీసీఐ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం బోర్డులో రెండు పదవుల్లో కొనసాగకూడదు. అయితే ఐసీసీలో ఉండొచ్చు అలాగే మధ్యలోనే బీసీసీఐని వదిలి వెళ్లేందుకు అనుమతి దక్కుతుందో లేదో. నేను తొందరపడడం లేదు. నాకు ఇంకా చాలా వయసు ఉంది. ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడైనా ఆ స్థానానికి వెళ్లొచ్చని అనుకుంటున్నా’అని గంగూలీ అన్నాడు. 

క్వారంటైన్‌ వ్యవధి తగ్గాలి 

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాకు వెళ్లే టీమ్‌ఇండియా ఆటగాళ్లకు తక్కువ వ్యవధి క్వారంటైన్‌ ఉండాలని బీసీసీఐ బాస్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. రెండు వారాల పాటు ప్లేయర్లు హోటల్‌ గదులకే పరిమితమవ్వాలని తాము అనుకోవడం లేదని అన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని, అందుకే ఇది సాధ్యపడుతుందని అన్నాడు. తాను డిసెంబర్‌ వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటానో లేదో తెలియదని, అయితే విరాట్‌ కోహ్లీకి మాత్రం ఆసీస్‌లో టెస్టు సిరీస్‌ ఎంతో ముఖ్యమైనదని దాదా చెప్పాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగడం భారత్‌కు మాత్రమే కాదని, ప్రపంచ క్రికెట్‌ మొత్తానికి ఎంతో లాభదాయకమని సౌరవ్‌ గంగూలీ అన్నాడు. 


logo