బుధవారం 08 జూలై 2020
Sports - May 21, 2020 , 19:31:05

నాకు క్రికెట్‌ అంటే పిచ్చి: ఛెత్రీతో శశి థరూర్‌

నాకు క్రికెట్‌ అంటే పిచ్చి: ఛెత్రీతో శశి థరూర్‌

న్యూఢిల్లీ: క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని, ప్రేమను కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ వెల్లడించారు. ఏడేండ్ల వయసు నుంచి క్రికెట్‌ను చూస్తున్నానని తెలిపారు. శశి థరూర్‌, భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఇష్టమైన క్రీడ ఏది అని ఛెత్రీ అడగడంతో థరూర్‌ సమాధానమిచ్చారు.

"నేను ఫుట్‌బాల్‌ చూడను. కానీ మా పిల్లలు ఆ క్రీడను ఎక్కువగా చూస్తారు. నా విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి క్రికెట్‌ ఎంతో పిచ్చి. ఏడేండ్ల వయసులో తండ్రితో కలిసి తొలిసారి టెస్టు మ్యాచ్‌ చూశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్‌నే చూస్తున్నా. అయితే నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే నేను చెప్పలేను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అర్ధ శతాబ్దానికి పైగా క్రికెట్‌ చూస్తుంటే చాలా మంది ఇష్టమైన క్రికెటర్లు ఉంటారు కదా. ఒకవేళ 20మంది ఫేవరెట్‌ క్రికెటర్లను ఎంపిక చేసుకోవాలంటే నాకు సులువవుతుంది" అని శశిథరూర్‌ చెప్పారు.

తొలుత ఇష్టపడిన క్రికెటర్‌ ఎవరు అని ఛెత్రీ అడుగగా.. "నేను మొదటగా ఎంతో ఇష్టపడిన క్రికెటర్‌ ఎంఎల్‌ జయసింహ. ఆయన ఎంతో ఆకర్షణీయమైన ప్లేయర్‌. ఆ తర్వాత ఎంఏకే పటౌడిని ఎంతో ఇష్టపడ్డా. ఒక కన్ను కోల్పోయినా.. ఆయన గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఎదిగారు. ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేశారు" అని శశి థరూర్‌ బదులిచ్చారు.  


logo