సోమవారం 25 మే 2020
Sports - Mar 28, 2020 , 11:55:09

కెప్టెనే బాస్.. కరోనా తీవ్రతను ముందే ఊహించాం : రవిశాస్త్రి

కెప్టెనే బాస్.. కరోనా తీవ్రతను ముందే ఊహించాం : రవిశాస్త్రి

న్యూఢిల్లీ: కొన్నేండ్లుగా టీమ్​ఇండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో సమర్థంగా ముందుండి నడిపిస్తున్నాడని హెడ్​కోచ్ రవిశాస్త్రి ప్రశసించాడు. తన దృష్టిలో జట్టుకు కెప్టెనే బాస్​ అని ఓ టీవీ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. “కెప్టెన్ బాస్ అనేది నేనెప్పుడూ నమ్ముతా. అత్యుత్తమంగా, భయం లేకుండా, సానుకూల దృక్పథంతో ఆడేందుకు ప్లేయర్లను సిద్ధం చేసేవారే కోచింగ్ సిబ్బంది అని నేను భావిస్తా. కెప్టెన్ జట్టును ముందుండి నడిపిస్తాడు. వారిపై కొంతఒత్తిడి తగ్గించేందుకు మేమున్నా.. మైదానంలో జట్టును నడిపించాల్సింది సారథే. అతడే పూర్తి నియంత్రణ సాధించాల్సి ఉంటుంది” అని రవిశాస్త్రి చెప్పాడు. ఫిట్​నెస్ విషయంలో క్రికెటర్లకు విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా ఉన్నాడని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఫిట్​నెస్ కోసం విరాట్ ఎంతో కష్టపడతాడని కితాబిచ్చాడు.

కరోనా తీవ్రతను ముందే అంచనా వేశాం

కరోనా వైరస్ ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందని న్యూజిలాండ్ పర్యనటలో ఉన్నప్పుడే భారత ఆటగాళ్లు అంచనా వేశారని రవిశాస్త్రి చెప్పాడు. మార్చిలో క్రీడలు ఆగిపోతాయని కూడా అనుకున్నామని చెప్పాడు. కాగా, దక్షిణాఫ్రికాతో రెండో వన్డే తర్వాత లాక్​డౌన్ సైతం తప్పదేమే అని అనిపించిందని చెప్పాడు. “వైరస్ తీవ్రత ఈస్థాయిలో ఉంటుందని భారత ఆటగాళ్లు కివీస్ పర్యనటలో ఉన్నప్పుడే ఊహించారు. సింగపూర్​ నుంచి రావడంతో కాస్త కంగారుపడినా.. స్వదేశానికి వచ్చేసరికి ఊపిరిపీల్చుకున్నారు. సరైన సమయంలోనే భారత్​కు చేరుకున్నామనుకున్నాం. అప్పటి నుంచే స్క్రీనింగ్ సైతం మొదలైంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆరోగ్య భద్రతపైనే అందరూ దృష్టిసారించాలి. క్రికెట్ గురించి ఆలోచన అవసరం లేదు. వైరస్ ప్రభావంపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో టీమ్​ఇండియా ఆటగాళ్లు ముందున్నారు” అని రవిశాస్తి చెప్పాడు.

సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటన నుంచి తిరిగొచ్చాక భారత్​… దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు ఆడాల్సింది. అయితే వర్షం కారణంగా ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే రద్దుకాగా, కరోనా ప్రభావంతో మిగిలిన రెండు జరుగలేదు,


logo