గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 30, 2020 , 03:28:56

ఢిల్లీపై 15 పరుగుల తేడాతో హైదరాబాద్‌ గెలుపు

ఢిల్లీపై 15 పరుగుల తేడాతో హైదరాబాద్‌ గెలుపు

  • రాణించిన వార్నర్‌, బెయిర్‌స్టో, రషీద్‌ ఖాన్‌

తోటి జట్లు భారీ స్కోర్లు చేస్తూ దూసుకెళ్తుంటే.. సన్‌రైజర్స్‌ మాత్రం తాను నమ్ముకున్న బౌలింగ్‌ సూత్రానికే కట్టుబడి బోణీ కొట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదురైనా కుంగిపోకుండా సమిష్టిగా సత్తాచాటింది. వార్నర్‌, విలియమ్సన్‌, బెయిర్‌స్టో సొగసైన బ్యాటింగ్‌కు.. రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ పదునైన బౌలింగ్‌ తోడవడంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన విలియమ్సన్‌ రాకతోనే రైజర్స్‌లో కొత్త జోష్‌ రాగా.. తన మిస్టరీ స్పిన్‌తో రషీద్‌ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు.

దుబాయ్‌: లీగ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ దళం అనే పేరును కాపాడుకుంటూ.. బౌలర్ల దమ్ముతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఖాతా తెరిచింది. మంగళవారం ఇక్కడి షేక్‌ జాయెద్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్లు బెయిర్‌స్టో (48 బంతుల్లో 53; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), డేవిడ్‌ వార్నర్‌ (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. విలియమ్సన్‌ (26 బంతుల్లో 41; 5 ఫోర్లు) వేగంగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో రబాడ, మిశ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  అనంతరం లక్ష్యఛేదనలో తడబడ్డ ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. ధావన్‌ (34) టాప్‌ స్కోరర్‌. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (3/14), స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (2/25) రాణించారు. రషీద్‌ ఖాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

బౌలర్లు భళా..

భారీ టార్గెట్‌ కాకున్నా.. సన్‌రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో ఢిల్లీకి ఛేదన అంత సులువు కాలేదు. జోరు మీదున్న యువ ఓపెనర్‌ పృథ్వీ షా (2).. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు ఆచితూచి ఆడింది. అక్కడి నుంచి రషీద్‌ ఖాన్‌ మ్యాజిక్‌ మొదలైంది. మొదట ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (17)ను బుట్టులో వేసుకున్న ఈ మిస్టరీ స్పిన్నర్‌.. ఆ తర్వాత ధవన్‌ (34)కు పెవిలియన్‌ దారి చూపించాడు. ఫలితంగా 12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 63/3తో నిలిచింది. ఉన్నంతసేపు దడదడలాడించిన హెట్‌మైర్‌ (12 బంతుల్లో 21; 2 సిక్సర్లు), పంత్‌ (27 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వెనుదిరగడంతో ఢిల్లీ ఓటమి   ఖాయమైంది. 

తలా కొన్ని..

గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో బరిలో దిగాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ రెండు మార్పులతో బరిలో దిగింది. మహమ్మద్‌ నబీ, వృద్ధిమాన్‌ సాహా స్థానాల్లో విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్‌ జట్టులోకి వచ్చారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించింది. వార్నర్‌, బెయిర్‌స్టో నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. దీంతో తొలి 5 ఓవర్లలో హైదరాబాద్‌ 24/0తో నిలిచింది. నోర్జే వేసిన ఆరో ఓవర్‌లో వార్నర్‌ 6,4తో స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో కూడా వేగం పెంచడంతో ఇక గాడిన పడ్డట్లే అనుకుంటున్న సమయంలో తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో 77 పరుగులు జోడించాక  వార్నర్‌ ఔటయ్యాడు. మిశ్రా బంతిని రివర్స్‌స్వీప్‌ చేసేందుకు యత్నించిన వార్నర్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మొదట అంపైర్‌ నిరాకరించినా.. రివ్యూలో గ్లౌజ్‌కు తాకినట్లు తేలడంతో వార్నర్‌ భారంగా పెవిలియన్‌ బాటపట్టాడు. కాసేపటికే మనీశ్‌ పాండే (3) కూడా ఔట్‌ కావడంతో హైదరాబాద్‌కు భారీ దెబ్బ పడింది. ఈ రెండు వికెట్లు అమిత్‌ మిశ్రా ఖాతాలోకే వెళ్లడం విశేషం. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. క్రీజులో కుదురుకున్నాక బౌండ్రీలతో రెచ్చిపోవడంతో సన్‌రైజర్స్‌ ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. తొలి మ్యాచ్‌ ఆడుతున్న సమద్‌ (7 బంతుల్లో 12 నాటౌట్‌; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు.

హైదరాబాద్‌: వార్నర్‌ (సి) పంత్‌ (బి) మిశ్రా 45, బెయిర్‌స్టో (సి) నోర్జే (బి) రబాడ 53, పాండే (సి) రబాడ (బి) మిశ్రా 3, విలియమ్సన్‌ (సి) అక్షర్‌ (బి) రబాడ 41, సమద్‌ (నాటౌట్‌) 12, అభిషేక్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 162/4. వికెట్ల పతనం: 1-77, 2-92, 3-144, 4-160, బౌలింగ్‌: ఇషాంత్‌ 3-0-26-0, రబాడ 4-0-21-2, నోర్జే 4-0-40-0, స్టొయినిస్‌ 3-0-22-0, మిశ్రా 4-0-35-2, అక్షర్‌ 2-0-14-0. 

ఢిల్లీ: పృథ్వీ (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్‌ 2, ధావన్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 34, అయ్యర్‌ (సి) సమద్‌ (బి) రషీద్‌ 17, పంత్‌ (సి) గార్గ్‌ (బి) రషీద్‌ 32, హెట్‌మైర్‌ (సి) పాండే (బి) భువనేశ్వర్‌ 21, స్టొయినిస్‌ (ఎల్బీ) నటరాజన్‌, అక్షర్‌ పటేల్‌ (బి) ఖలీల్‌ 5, రబాడ (నాటౌట్‌) 15, నోర్జే (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 147/7. వికెట్ల పతనం: 1-2, 2-42, 3-62, 4-104, 5-117, 6-126, 7-138, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-2, ఖలీల్‌ 4-0-43-1, నటరాజన్‌ 4-0-29-1, అభిషేక్‌ 4-0-34-0, రషీద్‌ ఖాన్‌ 4-0-14-3.

అబ్దుల్‌ అరంగేట్రం.. 

జమ్ము కశ్మీర్‌కు చెందిన అబ్దుల్‌ సమద్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. 18 ఏండ్ల సమద్‌ లెగ్‌స్పిన్‌ వేయడంతో పాటు స్లాగ్‌ ఓవర్స్‌లో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతడు జమ్ము తరఫున రెండు సెంచరీలు కూడా నమోదు చేశాడు. 


logo