సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జరిగే ఫార్ములా-ఈ రేసు షెడ్యూల్ గురువారం ఖరారైంది. 2023 ఏడాదికి గాను జనవరి 14న మెక్సికో సిటీ రేసుతో సీజన్‌కు తెరలేవనుంది. ఆ తర్వాత దిరియాహ్ (జనవరి 27-28), హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11న రేసు జరుగనుంది. కేప్‌టౌన్ (ఫిబ్రవరి 25), సావోపౌలో (మార్చి 25), బెర్లిన్(ఏప్రిల్ 22), మొనాకో(మే 6), జకార్తా (జూన్ 3), రోమ్ (జూలై 15), లండన్ (జూలై 29)లో రేసులు జరుగుతాయి. అయితే ఆతిథ్య హక్కులు దక్కించుకున్న హైదరాబాద్‌లో రేసును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో తొలిసారి మన దగ్గర జరుగుతున్న రేసు కోసం ఏర్పాట్లు చేస్తున్నది. హుసేన్సాగర్ వెంబడి..ఎన్టీఆర్ గార్డెన్స్, సచివాలయం, లుంబినీ పార్క్ మీదుగా జరిగే ఈ రేసు కోసం 2.37కి.మీల ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం పనులను పర్యవేక్షిస్తున్నది.