శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 15, 2020 , 23:39:42

హైదరాబాద్‌కు డిమోషన్‌

హైదరాబాద్‌కు డిమోషన్‌
  • పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో గ్రూపు-సికి.. విదర్భతో మ్యాచ్‌ డ్రా

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ 2019-20 సీజన్‌లో 8మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటి గెలిచిన హైదరాబాద్‌ జట్టు ఎలైట్‌ ఏ,బీ గ్రూపు నుంచి ఉద్వాసనకు గురైంది. ఈ గ్రూప్‌ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలువడంతో గ్రూప్‌-సికి పడిపోయింది. ఇక్కడి ఉప్పల్‌ మైదానంలో విదర్భతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌ను హైదరాబాద్‌ డ్రా చేసుకున్నా ఫలితం లేకపోయింది. మ్యాచ్‌ చివరి రోజైన శనివారం కొల్లా సుమంత్‌(65నాటౌట్‌), మహమ్మద్‌ సిరాజ్‌(46) రాణించడంతో ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆలౌటైంది. 184 పరుగుల లక్ష్యఛేదనలో విదర్భ చివరికి మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కాగా, గుజరాత్‌, బెంగాల్‌, కర్ణాటక, సౌరాష్ట్ర, ఆంధ్ర, జమ్ముకశ్మీర్‌, ఒడిశా జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. 


ఎందుకీ దుస్థితి..? 

ఘనమైన క్రికెట్‌ చరిత్ర.. భారత్‌కు ఎందరో దిగ్గజాలను అందించిన ఘనత.. గులాం అహ్మద్‌, ఎంఎల్‌ జయసింహా లాంటి లెజెండ్‌లు ఆడిన చరిత ఉన్న హైదరాబాద్‌ రంజీ జట్టు పరిస్థితి ప్రస్తుతం దీనావస్థకు చేరుకుంది. ఈ సీజన్‌ లీగ్‌ దశలో 8 మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అవమానకరంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇందులో మూడు ఇన్నింగ్స్‌ ఓటములు ఉండడం మరింత బాధాకరం. ఓ మ్యాచ్‌ మాత్రమే గెలిచి, మరొకటి డ్రా చేసుకొని కేవలం ఏడు పాయింట్లతో 18 జట్లు ఉన్న ఎలైట్‌ గ్రూప్‌-ఏ,బీ పట్టికలో హైదరాబాద్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో ఎలైట్‌ గ్రూప్‌ నుంచి ఉద్వాసనకు గురై గ్రూప్‌-సికి పతనమైంది. కాగా, రెండుసార్లు చాంపియన్‌ హైదరాబాద్‌ రంజీ జట్టుకు ఈ దుస్థితి ఎందుకు పట్టిందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అర్హత లేని అర్జున్‌ యాదవ్‌ను కోచ్‌గా నియమించడం వల్లే హైదరాబాద్‌ జట్టు వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్నదని ఈ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. విజయ్‌ హజారే ట్రోఫీ, ముస్తాక్‌ అలీ టోర్నీల్లోనూ జట్టు పేలవ ప్రదర్శన చేసినా అర్జున్‌ యాదవ్‌నే కొనసాగించడంపై అప్పట్లోనే ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. 


అర్జున్‌తో పాటు సహాయక సిబ్బందిని కొనసాగించడంపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతోపాటు, హెచ్‌సీఏలో రాజకీయాల వల్ల అంబటి రాయుడు వంటి ప్రతిభావంతుడైన సీనియర్‌ ప్లేయర్‌ వెళ్లిపోవడమూ జట్టును దెబ్బతీసింది. కోచ్‌ను మార్చాలని అతడు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. రాయుడు ఉదంతంతో హెచ్‌సీఏలో రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతుందన్నదని, ఇలాగైతే జట్టుకు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గతేడాది పీఠమెక్కిన మహమ్మద్‌ అజారుద్దీన్‌ పరిస్థితులు చక్కదిద్దుతాడని, కఠిన నిర్ణయాలు తీసుకొని జట్టును గాడిలో పెడతారని అందరూ ఆశించినా... దురదృష్టవశాత్తు అలాంటిది జరగలేదు. పరిపాలనాపరంగా నియామకాలు, హామీలు నెరవేర్చడం వంటి అంశాలపైనే ఆయన దృష్టి సారించడంతో హైదరాబాద్‌ రంజీ జట్టు ఘోర ప్రదర్శనను కొనసాగించింది.

- నమస్తే తెలంగాణ క్రీడా విభాగం


logo