సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 28, 2020 , 02:35:41

హైదరాబాద్‌ 171 ఆలౌట్‌

 హైదరాబాద్‌ 171 ఆలౌట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి:ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌ తీరు ఏ మాత్రం మారడం లేదు. ఎలైట్‌ గ్రూప్‌-ఏలో భాగంగా ఇక్కడి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం రాజస్థాన్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన చేసింది. కొల్లా సుమంత్‌ (51) మాత్రమే అర్ధశతకంతో రాణించడంతో హైదరాబాద్‌ తొలిరోజు 171పరుగులకే ఆలౌటైంది. బావనక సందీప్‌ (38) ఓ మోస్తరుగా ఆడగా.. చివర్లో సీవీ మిలింద్‌ (34) రాణించడంతో ఆతిథ్య జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (3), అక్షత్‌ రెడ్డి (10), జావేద్‌ అలీ (0), హిమాలయ్‌  అగర్వాల్‌ (4), రవితేజ (0)  పూర్తిగా విఫలమయ్యారు.  మెహదీ హసన్‌ (0), రవికిరణ్‌ (8) నిలువలేకపోగా.. పీఎస్‌ శ్రీరామ్‌ (11నాటౌట్‌) నాటౌట్‌గా మిగిలాడు. రాజస్థాన్‌  బౌలర్లలో అనికేత్‌  చౌదరీ, రితురాజ్‌  సింగ్‌ చెరో మూడు వికెట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నాలుగు ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 2పరుగులు చేసింది. ఓపెనర్లు యశ్‌  కొఠారీ, నరేందర్‌  సింగ్‌ క్రీజులో ఉన్నారు. 


సర్ఫరాజ్‌ ద్విశతకం 

గత మ్యాచ్‌లో అజేయ త్రిశతకంతో అదరగొట్టిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి అజేయ ద్విశతకంతో విశ్వరూపం చూపాడు. వన్డేను మైమరిపిస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌పై సర్ఫరాజ్‌ 213 బంతుల్లోనే 226 పరుగులు చేయడంతో మ్యాచ్‌ తొలి రోజు ముగిసే సరికి ముంబై ఐదు వికెట్లు కోల్పోయి 372 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్‌తో పాటు శుభం రంజనే (44నాటౌట్‌) ఉన్నాడు. టాపార్డర్‌ విఫలమవడంతో ఓ దశలో 71పరుగులకే 4వికెట్లు కోల్పోయిన ముంబై.. సర్ఫరాజ్‌  ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు దిశగా పరుగెడుతున్నది. 


logo