సోమవారం 23 నవంబర్ 2020
Sports - Nov 07, 2020 , 02:29:27

క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌

 క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌

  • ఎలిమినేటర్‌లో బెంగళూరుపై విజయం.. మెరిసిన హోల్డర్‌, విలియమ్సన్‌

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి మూకుతాడు వేయడంలో కొమ్ములు తిరిగిన హైదరాబాద్‌.. బెంగళూరును బెంబేలెత్తించింది. అటు పేస్‌, ఇటు స్పిన్‌తో ముప్పెట దాడి చేసి కోహ్లీ సేనను ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసిన రైజర్స్‌.. ఆనక ఛేజింగ్‌లో కాస్త తడబడ్డా మిడిలార్డర్‌లో కేన్‌ విలియమ్సన్‌ తన విలువ చాటుకోవడంతో ముందంజ వేసింది. ఈ పరాజయంతో బెంగళూరు ఇంటిదారి పడితే.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగనున్న క్వాలిఫయర్‌-2 కోసం హైదరాబాద్‌ అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నది. 

అబుదాబి: కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలో దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో అడుగు ముందుకేసింది. లీగ్‌ చివర్లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన వార్నర్‌ సేన అదే ఊపులో శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన ఎలిమినేటర్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డివిలియర్స్‌ (43 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధశతకం సాధించగా.. ఫించ్‌ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో  హోల్డర్‌ 3, నటరాజన్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' విలియమ్సన్‌ (44 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా.. మనీశ్‌ పాండే (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), హోల్డర్‌ (24 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

కేన్‌ కడవరకు..

ఓ మాదిరి లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ కూడా తడబడింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ సాహా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా కాగా.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన శ్రీవత్స్‌ గోస్వామి (0) ఆకట్టుకోలేకపోయాడు. వార్నర్‌ (17), మనీశ్‌ పాండే  కుదురుకోవడంతో ఇక సులభమే అనుకుంటుంటే.. అంపైర్‌ సందేహాస్పద నిర్ణయానికి వార్నర్‌ ఔటయ్యాడు. కాసేపటికే పాండే కూడా ఔట్‌ కాగా.. ప్రియమ్‌ గార్గ్‌ (7) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. దీంతో హైదరాబాద్‌ 67/4తో నిలిచింది. ఈ దశలో విలియమ్సన్‌, హోల్డర్‌ స్కోరుబోర్డును నడిపించారు. సాధించాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడంతో ఆచితూచి ఆడుతూ ముందుకు సాగారు. చివరి మూడు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన దశలో విలియమ్సన్‌ కొట్టిన సూపర్‌ షాట్‌ను పడిక్కల్‌ బౌండ్రీ లైన్‌ వద్ద అద్భుతంగా అడ్డుకోగా.. సమీకరణం 12 బంతుల్లో 18కి చేరింది. ఈ దశలో సిరాజ్‌ వేసిన 19వ ఓవర్‌లో 9 పరుగులు రాగా.. సైనీ వేసిన చివరి ఓవర్‌లో హోల్డర్‌ రెండు ఫోర్లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

హోరెత్తించిన హోల్డర్‌..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే పెద్ద షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అవతారమెత్తిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (6) రెండో ఓవర్‌లోనే ఔట్‌ కాగా.. ఈ సీజన్‌లో నిలకడగా ఆడుతున్న దేవదత్‌ పడిక్కల్‌ (1) అతడిని అనుసరించాడు. ఈ రెండు వికెట్లు హోల్డర్‌ ఖాతాలోకే వెళ్లాయి. దీంతో బెంగళూరు 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఫించ్‌, డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించాక ఫించ్‌, మొయిన్‌ (0) ఒకే ఓవర్‌లో ఔటయ్యారు. సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫించ్‌ వెనుదిరిగితే.. నోబాల్‌కు రనౌటై మొయిన్‌ అలీ భారంగా డగౌట్‌ చేరాడు. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్న డివిలియర్స్‌ పట్టుదలతో క్రీజులో నిలిచాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏబీకి కాసేపు అండగా నిలిచిన దూబే (8)ను హోల్డర్‌ ఔట్‌ చేస్తే నటరాజన్‌ 18వ ఓవర్‌లో సుందర్‌ (5), డివిలియర్స్‌ను వెనక్కి పంపాడు. నట్టూ వేసిన యార్కర్‌కు ఏబీ వద్ద సమాధానమే లేకపోయింది. చివర్లో సైనీ (9*), సిరాజ్‌ (10*) విలువైన పరుగులు జోడించారు.